మోతె ముడుపు తీర్చుకున్న కెసిఆర్, తెరాసలోకి ఆకుల
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం జిల్లాలోని మోతె గ్రామంలో అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య మట్టి ముడుపును మోతెలో కలిపారు. ముడుపును నెత్తిన పెట్టుకొని సభకు వచ్చారు. పద్నాలుగేళ్ల క్రితం మోతె నుండి ముడుపు కట్టి తెచ్చిన మట్టిని కెసిఆర్ గ్రామంలో కలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మోతే గ్రామం తన గుండెల్లో ఉందని చెప్పారు. ఉద్యమం సమయంలో మోతె గ్రామస్థులు తనకు కొండంత అండను ఇచ్చారన్నారు. ముత్యం వంటి మోతె గ్రామానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి మోతె మూటను చూసుకొని ముందుకు నడిచానన్నారు. పోరాటంలో బలమైన శత్రువులు ఉన్నప్పటికీ మోతె గడ్డ తనను ముందుకు నడిపించిందన్నారు.

మోతె గ్రామానికి గోదావరి నీళ్లు వంద శాతం తీసుకు వస్తామన్నారు. గ్రామంలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తాను బతికి ఉన్నన్ని రోజులు మోతె తన గ్రామమే అన్నారు. బలహీన వర్గాల వారికి మూడు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూం ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ గ్రామానికి ఎంత చేసినా తక్కువే అన్నారు.
గాడిదలకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండితే..
తెలంగాణను తెరాస మాత్రమే అభివృద్ధి చేస్తుందని, ఎన్నికల్లో తెరాసకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావన్నారు. తాను బతికినా చచ్చినా ఒకటేనని నాడు ఆమరణ దీక్షకు దిగితే కేంద్రం తెలంగాణను ప్రకటించిందన్నారు. తెలంగాణ కోసం రాత్రనగా పగలనకా పోరాడిన తెరాసకు ఓటు వేసి గెలిపించాలన్నారు. స్థాయిని బట్టి మండలాలలో నాలుగు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని, లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామన్నారు.
తెరాసలోకి మల్కాజిగిరి ఎమ్మెల్యే
మల్కాజిగిరి కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆయనకు కెసిఆర్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. కెసిఆర్‌తోనే తెలంగాణ పునర్ నిర్మాణం సాధ్యమని తాను భావిస్తున్నందువల్లే తెరాసలో చేరినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications