తమ్ముడి దుకాణం మొదలైంది: పవన్ కళ్యాణ్‌పై కెసిఆర్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం వార్తలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తనదైన శైలిలో ప్రతిస్పందించారు. అన్న (చిరంజీవి) దుకాణం మూసేశారు, తమ్ముడి (పవన్ కళ్యాణ్) దుకాణం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా నటులను చూసి మోసపొవద్దని ఆయన ప్రజలకు సూచించారు.
సంక్రాంతి గంగిరెద్దుల్లా కొత్త పార్టీలు వస్తున్నాయని, కొత్త పార్టీలను నమ్మవద్దని ఆయన అన్నారు. తెలంగాణలోని పార్లమెంటు సీట్లన్నీ మనమే గెలవాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను ఇప్పటికీ ఆపాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర విభజన చట్టబద్దమైందని, దాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.

వరంగల్ జిల్లా మహబూబాబాద్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ నెహ్రూ నాయక్ శుక్రవారం కెసిఆర్ సమక్షంలో తెరాసోల చేరారు. జేజేమ్మలు దిగి వచ్చినా తెలంగాణ ఆగదని ఆయన అన్నారు. 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామని, ఇంకా కొన్ని అసంతృప్తులున్నాయని, వాటిని పరిష్కరించుకుందామని ఆయన అన్నారు.
ఇక తెలంగాణ ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. చిరునవ్వుల తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తానని ఆయన చెప్పారు. నిరుద్యోగులు, రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని కెసిఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగపడేది గిరిజన, దళితులేనని ఆయన అన్నారు. గిరిజనులకు ప్రత్యేక సంస్కృతి ఉందని, వాళ్లకు ప్రతి రంగంలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కోయ, గోండు, చెంచు గూడాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పారు ఎస్సీలకు ఏడున్నర వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications