ఏపీలో బీఆర్ఎస్ చీల్చేది వారి ఓట్లే- కాపు నేత చేగొండి హరిరామజోగయ్య జోస్యం..
ఏపీలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీపై ఇప్పటికే పలు ఊహాగానాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎంట్రీపై నిన్న మొన్నటి వరకూ నోరు మెదపని పార్టీలు కూడా తాజాగా ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించగానే విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సైతం బీఆర్ఎస్ ఎంట్రీపై ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ వెనుక గల కారణాన్ని చేగొండి హరిరామ జోగయ్య తనదైన శైలిలో విశ్లేషించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన ఓట్లు చీల్చేందుకే బీఆర్ఎస్ అడుగుపెడుతోందని చేగొండి తెలిపారు. తెలుగ రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకుని బీఆర్ఎస్ కు ఏపీలో ఎంట్రీ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది వారిద్దరి ప్లాన్ లో భాగమేనన్నారు. జాతీయ పార్టీ గుర్తింపు ముసుగులో ఏపీలో బీఆర్ఎస్ పోటీకి సిద్ధమవుతోందని జోగయ్య ఆరోపించారు.

2019 ఎన్నికల్లో జగన్ కు కేసీఆర్ రూ.700 కోట్ల నిధులు సమకూర్చారని హరిరామజోగయ్య ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్ రుణం తీర్చుకునేందుకే జగన్ బీఆర్ఎస్ ఎంట్రీపై నోరు మెదపడం లేదన్నారు. టీడీపీ-జనసేన ఓట్లను లక్ష్యంగా చేసుకునే బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెడుతోందన్నారు. కాబట్టి ఇకనైనా ఏపీలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండి ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలని జోగయ్య కోరారు. మరోవైపు కాపుల రిజర్వేషన్ల కోసం తాను దీక్ష చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంట్రీతో పాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో జోగయ్య స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications