పవన్ దాడి, మోడీ గాలిపై కెసిఆర్ ధీటు వ్యూహం
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటకారితనం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ఉపయోగిపడినట్లే ఉంది. తెలంగాణ నేతలను కించపరుస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెరాసకు ఉపయోగపడినట్లు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తిప్పికొట్టడంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, ఇతర పార్టీ నాయకులు అనుసరించిన వ్యూహం పనిచేసినట్లు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత పుట్టేలా చేయడంలో వారు విజయం సాధించారని అంటున్నారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలి ఉందని ముందుగానే పసిగట్టిన కెసిఆర్ దాన్ని ఎదుర్కోవడానికి ధీటైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. ముందు మన తెలంగాణను మనం రక్షించుకుందాం, ఒక ఓటు బిజెపి, ఒకటి టిఆర్‌ఎస్ అనుకుంటే దెబ్బతింటాం రెండు ఓట్లు టిఆర్‌ఎస్‌కే వేయాలని కెసిఆర్ వాదించారు. తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ మంది ఎంపీలను కేంద్రానికి పంపించడం అవసరమని నమ్మించారు. దీంతో తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలను కూడా గెలుచుకోవడంలో విజయం సాధించారు. దేశం మొత్తంలో నరేంద్ర మోడీ గాలి వీచినా తెలంగాణలో మాత్రం ఆ ప్రభావం లేకుండా చేయడంలో కెసిఆర్ విజయం సాధించారు.
కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెడితే నష్టపోతామని, టిడిపి ఆంధ్రా పార్టీ అంటూ కెసిఆర్ సంధించిన విమర్శనాస్త్రాలు పనిచేశాయి. తెలంగాణ కాంగ్రెసు నాయకులపై ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం లేకపోవడం, దాన్ని పెంచే విధంగా కెసిఆర్ విమర్శానాస్త్రాలు సంధించడం తెరాసకు కలిసి వచ్చింది. ప్రత్యర్థులు మాట్లాడుతున్న మాటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి ధీటైన జవాబు చెప్పడంలో కెసిఆర్ అత్యంత వేగంగా కదిలారు.

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజక వర్గాలున్న తెలంగాణలో 63 సీట్లు సాధించి తెరాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. ఈ మ్యాజిక్ ఫిగర్‌కు టిఆర్‌ఎస్ చేరుకోవడం అసాధ్యం అనుకున్నారు, హంగ్ తప్పదన్నారు, పలు సర్వేలు సైతం అదేమాట చెప్పాయి. కానీ కెసిఆర్ మాత్రం కచ్చితంగా అధికారంలోకి వస్తామని చెబుతూ వచ్చారు. చెప్పినట్టుగానే మ్యాజిక్ ఫిగర్ కన్నా మూడు సీట్లు ఎక్కువనే సాధించారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఏకపక్షంగానే ఫలితాలు సాధించారు. 17 పార్లమెంటు నియోజక వర్గాలుంటే 12 గెలుచుకుని సత్తా చాటింది..
పార్టీ ఆవిర్భావం తరువాత టిఆర్‌ఎస్ తొలిసారిగా పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది ఈ ఒక్కసారి మాత్రమే. పోటీ చేసిన తొలిసారే అధికార పీఠం అందుకుంది. మోడీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడడం, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలంగాణ నాయకులను కించపరుస్తూ తెలంగాణలో ప్రచారం చేయడం తెరాసకు కలిసి వచ్చింది.
చివరి పది రోజులు కెసిఆర్ రోజుకు పది నియోజక వర్గాల్లో హెలికాఫ్టర్‌లో విస్తృతంగా ప్రచారం సాగించారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగిన నాయకుడంటూ లేరు, అదే సమయంలో కెసిఆర్ తెలంగాణకు బలమైన నాయకత్వం అందివ్వగలరనే నమ్మకం కలిగించారు. తెరాస విజయానికి ఇది బాగా కలిసొచ్చింది. మన రాష్ట్రం మన పార్టీ అంటూ కెసిఆర్ చేసిన ప్రసంగాలు, ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజల్లోకి బాగా వెళ్లింది.












Click it and Unblock the Notifications