కెసిఆర్ సర్వే: బిజెపితో పొత్తు, కాంగ్రెసు పొత్తుపై ఒత్తిడి

ముఖ్యమైన నాయకులనే కాకుండా జిల్లా స్థాయి నాయకులను కూడా కెసిఆర్ సంప్రదించి బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే విషయంపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఎన్నికల ఫలితాల తర్వాత మనం అనుకున్న తెలంగాణ పునర్నిర్మాణం కోసం మనకే నాయకత్వ బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదని, బిజెపితో వెళితే ఆ సమస్య ఉండనే ఉండదని, మనమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతో ప్రజలు లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఓటేసే పరిస్థితి ఉందని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో తాము ఒంటరి పోరుకు వెళితే గందరగోళం ఏర్పడుతుందని, తాము అన్ని విధాలా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు. లోక్‌సభ స్థానాలను ఎక్కువగా గెల్చుకునే అవకాశం ఉండదని, ఎన్నికల్లోనూ, ఆ తర్వాత కూడా మనకు రాజకీయంగా లాభం కలగాలంటే కేంద్రంలో తప్పక అధికారంలోకి వచ్చే అవకాశాలున్న బిజెపితో వెళ్లడమే బాగుటుందని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ సిటింగ్ స్థానాల నుంచి తెరాస టికెట్ ఆశిస్తున్న వారంతా కాంగ్రెస్‌తో పొత్తు వద్దని గట్టిగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బిజెపి, తెరాస మధ్య పొత్తు కుదిరితే, ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ సహా మరికొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసును తన వైపు తిప్పుకోవడానికి కెసిఆర్ బిజెపితో వెళ్తామనే సంకేతాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications