కెసిఆర్: బాబు సహ యాత్రికుడు, మాటల మాంత్రికుడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అవునన్నా, కాదన్నా హీరో అయ్యాడు. తెలంగాణలో తాను తప్ప మరొకరు ఉండకూడదనే వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నాడు. రాజకీయాల్లో ఆయన ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సహ యాత్రికుడు. మాటల మరాఠీగా పేరు పొందారు. రాజకీయాల్లో కెసిఆర్‌ను మించిన వ్యూహకర్త లేరని అంటారు.
ఆయన ఎప్పుడు ఎందుకు మౌనం వహిస్తారో, ఎప్పుడు అకస్తాత్తుగా విరుచుకుపడతారో ఎవరికీ తెలియదు. కానీ అదంతా ఆయన వ్యూహంలో భాగంగానే జరుగుతుంది. మౌనంగా ఉండిపోయి, తన మాటలతో ఒక్కసారిగా నోరు విప్పుతారు. దాంతో రాజకీయాలు ఆయన చుట్టే తిరుగుతాయి. కెసిఆర్ వ్యూహాత్మక కార్యాచరణ వల్లనే తెలంగాణ సాధ్యమైందని విశ్వసించేవాళ్లు చాలా మంది ఉన్నారు.

శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవితో సంతృప్తి చెందని కెసిఆర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఏర్పాటు చేసారు. సంజీయ్ గాంధీ హయాంలో చంద్రబాబుతో కలిసి ఆయన యువజన కాంగ్రెసులో పనిచేశారు.
మెదక్ జిల్లాలో 1954 ఫిబ్రవరి 17వ తేదీన జన్మించిన చంద్రశేఖర రావు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెసులోనే ఉన్నారు. తెరాసను ఏర్పాటు చేసే వరకు ఆయన టిడిపిలోనే ఉన్నారు. నాలుగుసార్లు మెదక్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. టిడిపి ప్రభుత్వ హయాంలో జన్మభూమి వంటి పలు విజయవంతమైన పథకాలకు రూపకర్త కెసిఆర్ అని చెబుతారు.
తెరాసను నడపడంలో ఆయన అనేక ఒడిదొడుకులను ఎదుర్కున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తెరాసను లక్ష్యంగా చేసుకుని, దాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఆయన మరణాంతరం రోశయ్య ప్రభుత్వ హయాంలో 2009 నవంబర్ 29వ తేదీన నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయన దీక్ష 11 రోజుల పాటు సాగింది.
2004లో కాంగ్రెసుతో తెరాస పొత్తు పెట్టుకుంది. తెరాస అటు కాంగ్రెసు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ చేరింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేస్తుందంటూ రాజీనామాలు చేసి తెరాస శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు బయటకు వచ్చారు. రెండో సారి వైయస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కెసిఆర్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి.
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కెసిఆర్ పొత్తు పెట్టుకుంది. అయితే, టిడిపి అపజయం పాలై తిరిగి రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. వైయస్ మరణాంతరం రోశయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా మారింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటన చేసింది.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేయడంతో ఆ ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం 13 రోజుల తర్వాత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత కెసిఆర్, తెలంగాణ జెఎసి సహకారంతో ఉద్యమాన్ని నడిపించారు. చివరకు 2013 జులై 30వ తేదీ సిడబ్ల్యుసి ప్రకటనతో తెలంగాణకు అడ్డంకులు తొలగినట్లయ్యాయి.












Click it and Unblock the Notifications