టిపై మోడీ సూచన, బాబుకు నేను..నాకు బాబు: కెసిఆర్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల పైన స్పందించారు. తాను శనివారం ప్రధాని మోడీని కలిశానని, కొత్త రాష్ట్రానికి సహకారం అందించాలని కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏది ఇచ్చినా ఇరు రాష్ట్రాలకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే సౌకర్యాలు, తెలంగాణకు, తెలంగాణకు ఇచ్చే సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని కోరానన్నారు. తన జీవితంలో ప్రధాని కావాలనుకున్నానని, అయ్యానని, ఇప్పుడు దేశ అభివృద్ధే తనకు ముఖ్యమని మోడీ చెప్పారని కెసిఆర్ తెలిపారు. రాష్ట్రాలకు అధికారం ఇస్తే బాగుపడుతుందని నమ్మినవాళ్లలో తాను ఒకడినని, ఆ దిశలో వెళ్తానని చెప్పారన్నారు. ఏదైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాలని చెప్పారన్నారు.

తెలంగాణ అభివృద్ధికి మోడీ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. పాతికేళ్లలో జరిగే అభివృద్ధి ఐదేళ్లలో చేయవచ్చునని సూచించారన్నారు. కేంద్రం సహకారం ఉంటుందని హామీ ఇచ్చారన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్లానింగ్ కమిషన్ నివేదికలో ఎనిమిది జిల్లాలు తెలంగాణవేనని గుర్తు చేశారు. మోడీతో తమ చర్చల సారాంశం.. తెలంగాణకు కేంద్రం సంపూర్ణ సహకారమే అన్నారు. ఫార్మేషన్ డే అధికారికంగా జరగలేదని, దానికి రమ్మంటే వస్తానని చెప్పారన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణపై ప్రణాళిక ప్రకటిస్తానని మోడీ చెప్పారన్నారు.
పోలవరంపై వివరణ
తాను పోలవరం ముంపు మండలాల పైన ప్రధాని ఎదుట ప్రస్తావించనట్లు చెప్పారని కానీ ప్రత్యేకంగా విజ్ఞప్తి పత్రంలో చెప్పనప్పటికీ ఆయన ముందు దానిని ప్రస్తావించానని తెలిపారు. ఏడు మండలాల విషయంలో మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టించారని, హడావుడి నిర్ణయం తీసుకున్నారని తాను మోడీకి చెప్పానని తెలిపారు. పోలవరం నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు. అన్ని రాష్ట్రాల్లోను గిరిజనులే మునిగిపోతారని చెప్పారు. డిజైన్‌కు ప్రత్యామ్నాయమార్గం ఉందని చెప్పారు.
బాబుకు శుభాకాంక్షలు
ఎపి సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబుకు తాను హండ్రెడ్ పర్సెంట్ శుభాకాంక్షలు చెబుతున్నానని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎపి అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఎపి ప్రజలకు శుభం జరగాలన్నారు. రాష్ట్రాలు వేరైనా తెలుగువారం ఒక్కటే అన్నారు. తెలంగాణకు ప్రత్యేక హోదా డిమాండు చంద్రబాబు, టిటిడిపి నేతల ఇష్టమన్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావం ఉండాలని, ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఆలంపూర్ నుండి భద్రాచలం వరకు ఇరు రాష్ట్రాల మధ్య బార్డర్ ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి ఎప్పుడు కో ఆపరేషన్ ఉంటుందని, చంద్రబాబు నుండి కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాలు వేరైనా అన్నదమ్ముల్లా తెలుగువారందరం కలిసి ఉందామన్నారు. చంద్రబాబుకు తాము సహకరిస్తామని, మాకు వారు సహకరించాలన్నారు.












Click it and Unblock the Notifications