హరీశ్‌కు నోటి దూల ఎక్కువ: 'తరిమికొడతామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచిది కాదు'
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్‌కు నోటి దూల ఎక్కువని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్న విషయం గుర్తించుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
తరిమికొడతామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంత్రి హోదాలో ఉన్న నేతలు చేయాల్సినవి కావని ఈ సందర్భంగా కేఈ అన్నారు. అయినా ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఎక్కడున్నాయో, ఎప్పుడు వచ్చాయో చూపాలని కూడా కేఈ డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలకు ఆద్యుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆరోపించిన కేఈ... రాయలసీమ ఎడారిగా మారుతుందని వైఎస్ జగన్ నిత్యం చెప్పడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఎలా అడ్డుకోవాలో తమ దగ్గర వ్యూహం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్ చేపట్టిన జలదీక్షపై కూడా కాస్తంత ఘాటుగానే వ్యాఖ్యానించారు. జగన్ దీక్ష తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద లేదా ఢిల్లీలో చేయాలని కేఈ సూచించారు. అటు, ఇటు కానీ కర్నూలులో దీక్ష చేయడం వల్ల జగన్‌కు, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన వైయస్ జగన్ ఏనాడూ రాష్ట్ర సమస్యలను ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించలేదని కేఈ కృష్ణమూర్తి విమర్శించారు.
తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలంటూ జగన్ చేపట్టిన జలదీక్షపై సోమవారం మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డా ఆంధ్రనాయకుల ద్రోహబుద్ధి మారటం లేదని అన్నారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి.. మా బతుకు మాకు బతుకనివ్వాలని కోరారు.

పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ అధికారంలో ఉన్నపుడు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా రైతుల ఆత్మహత్యలు, కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలకు కారణమయ్యారని అన్నారు. ఇపుడు తెలంగాణ రైతులను ఆదుకోవడానికి బ్రిజేష్‌కుమార్ తీర్పుకు లోబడి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని తెలిపారు.
కృష్ణా నదిలో 376 టీఎంసీల కేటాయింపులకు లోబడి తమ ప్రాజెక్టు కట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. వలసలు కరువుతో తల్లడిల్లే మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులను అడ్డుకోవటం కనీసం మానవత్వం అనిపించుకోదని అన్నారు. చంద్రబాబుపై కోపంతో జగన్.. జగన్‌పై కోపంతో చంద్రబాబు పోటీపడి తెలంగాణ మీదపడ్డారని హరీశ్ ధ్వజమెత్తారు.
జగన్ దీక్ష పేరిట చిచ్చు పెడితే చంద్రబాబు హైకోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలను మానుకోనిపక్షంలో తాము తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మేము మంచితనంగా ఉంటున్నాం, కృష్ణా నదికి పైన మేమే ఉన్నాం. అయినా ఏపీ వాటా చుక్క నీటిని కూడా తాకబోం. మా నీళ్లను మాత్రమే వాడుకుంటాం అని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications