రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ దక్కేనా - అక్కడే బిగ్ మిస్టేక్..!?
ఏపీలో ఈ సారి హ్యాట్రిక్ విజయం కోసం ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. మూడు పార్టీల కూటమి, వైసీపీ మధ్య పోరు హోరా హోరీగా మారుతోంది. పోలింగ్ కు సరిగ్గా పది రోజుల సమయం ఉంది. పలు నియోజకవర్గాల్లో గెలుపు ముఖ్య నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్ది రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి.
మారుతున్న లెక్కలు
శ్రీకాకుళంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎంపీగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు..వైసిపి నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ నుంచి పేడాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపిగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు వరుసగా విజయం సాధించారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి టిడిపి పరిస్థితి అంత సానుకూలంగా కనిపించడం లేదు.

అభ్యర్థుల ఎంపికలో టిడిపి తీసుకున్న నిర్ణయాలు, గ్రూపుల పోరు గెలుపు అవకాశాలను కొంతమేర కష్టంగా మారతాయనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసిపి ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలూ సాగిస్తోంది. 2019 ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గానూ ఐదు చోట్ల అభ్యర్థులు ఘన విజయం సాధించినా వైసిపి ఎంపి సీటును కోల్పోయింది. టీడీపీ నుంచి అభ్యర్థులను మార్చిన నియోజకవర్గాల్లో ఈ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
ఎవరి ధీమా వారిది
శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టిడిపి ఇన్‌ఛార్జులు గుండ లకీëదేవి, కలమట వెంకటరమణకు పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఆగ్రహం చల్లారలేదు. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో పాతపట్నం టిడిపి ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణను పిలిచి బుజ్జగించారు. ఆయనకు టిడిపి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అయినా అక్కడ కలమట గ్రూపు సరిగ్గా పనిచేయడం లేదు.
ఆమదాలవలస నియోజకవర్గంలో వైసిపి రెబల్ అభ్యర్థిగా సువ్వారి గాంధీ పోటీలో ఉన్నారు. నయానో, భయానో ఆయనతో నామినేషన్ ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర పార్టీ పెద్దలు చేసిన ఫలితాలు ఫలించలేదు. దీంతో వైసిపి అభ్యర్థి శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఇక్కడ నష్టం వాటిల్లనుంది.

విజయం దక్కేదెవరికి
నరసన్నపేటలో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, అతని కుటుంబంపై ఉన్న అసంతృప్తితో ఇటీవల నాలుగు మండలాల ముఖ్య నాయకులు అంతా టిడిపిలో చేరారు. ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, టిడిపి అభ్యర్థి గౌతు శిరీష నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
ఇచ్ఛాపురంలోనూ వైసిపి, టిడిపి అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పేడాడ పరమేశ్వరరావు దక్కించుకొనే ఓట్లు ఎంపీ అభ్యర్ది గెలుపు ఓటముల్లో కీలకం కానుంది. దీంతో..శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం సాధిస్తారా..లేక బ్రేకులు పడుతాయా అనేది ఈ ఎన్నికల్లో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications