కిరణ్ ప్లాన్: తెలంగాణ బిల్లుపై సంక్రాంతి తర్వాతే..
హైదరాబాద్: శాసనసభ ప్రత్యేక సమావేశాలను వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. విభజన బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా చూడడం తమ తక్షణ కర్తవ్యమని, వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల వరకూ బిల్లును ఆమోదించకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రికి సన్నిహితుడైన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ జాతీయ పత్రికతో అన్నారు.
కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ.. నెల్సన్ మండేలా సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొని బుధవారం సాయంత్రం భారత్‌కు చేరుకుంటారు. డిసెంబర్ 12న న్యాయ నిపుణులతో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చిస్తారు. ఆ తర్వాత ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిసెంబర్ 12 లేదా 13 తేదీల్లో పంపించే అవకాశం ఉంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విభజన ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించి సుదీర్ఘ చర్చ జరిగే విధంగా ఆరు వారాల గడువు ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

బిల్లుపై చర్చించిన తర్వాత రాష్ట్ర శాసనసభ్యులు వారి అభిప్రాయాలను కేంద్రానికి తెలియజేస్తారని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన సమయంలో అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణ్ ఆ రాష్ట్రాలకు బిల్లుపై చర్చించేందుకు ఆరువారాల సమయాన్ని ఇచ్చారు. వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ బిల్లును కేంద్రానికి సాధ్యమైనంత ఆలస్యంగా పంపించాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 12 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత మళ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 11న ప్రారంభమయ్యే అసెంబ్లీ సలహా సంఘం(బిఏసి) సమావేశాలను కూడా ఈ సమావేశాలతోనే ఐదు రోజులపాటు కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షన జరిగే శాసనసభ సమావేశాల్లో సభ నాయకుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తను అనుకున్న ఏజెండా అంశాన్ని ప్రవేశపెట్టి అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ముసాయిదా బిల్లుకు అనుకూలంగా వ్యవహరించనున్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీల బలాలు విభజనను వ్యతిరేకిస్తున్న పార్టీల కంటే తక్కువ ఉండడంతో కిరణ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాన్ని అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications