'ఆయన' కోసం 2 రాష్ట్రాలు.. 2 రాజకీయ పార్టీలు హోరాహోరీ
ఆయన కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. తమ పార్టీలోకి రావాలని, తమ పార్టీ తరఫున పోటీచేయాలంటూ ఆహ్వానం పలుకుతున్నాయి. పోటీ కూడా సాధారణంగా లేదు. హోరాహోరీగా ఉంది. పోనీ ఆయనేమన్నా సీనియర్ రాజకీయవేత్తా అంటే కాదు. రాజకీయాల్లో బంధుగణం ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎన్నికల్లో పోటీచేయలేదు. తన పని తాను చూసుకుంటారు. ఆయనే కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కేశవరెడ్డి.

శ్రీచైతన్య, నారాయణకు ధీటుగా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి విద్యాసంస్థల ఏర్పాటు ద్వారా సంచలన సృష్టించారు. శ్రీచైతన్య, నారాయణకు ధీటుగా తన విద్యాసంస్థలను కూడా తీర్చిదిద్దారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఆయన గతంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే శిశు మందిర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ నాయకులతో, వారిద్వారా భారతీయ జనతాపార్టీ నాయకులతో సంబంధాలేర్పడ్డాయి. విద్యాసంస్థలు స్థాపించిన సమయంలో పదోతరగతి ఫలితాల్లో ఆ సంస్థ విద్యార్థులు కొన్నాళ్లు స్టేట్ టాపర్స్ గా నిలిచారు.

నడుస్తున్న కార్యకలాపాలు
విద్యా సంస్థలను నడపడానికి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పాజిట్లు సేకరించారనే ఆరోపణలు రావడం, డిపాజిట్లు ఇచ్చినవారికి వడ్డీతోపాటు విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించారని ఆరోపణలొచ్చాయి. తర్వాత విద్యాసంస్థల పనితీరు మందగించింది. ప్రస్తుతం కేశవరెడ్డి విద్యాసంస్థల కార్యకలాపాలు నడుస్తున్నాయి.

కర్నూలు లేదా మల్కాజిగిరి
వచ్చే ఎన్నికల్లోకేవశరెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా పోటీచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రస్తుత ఎంపీగా సంజీవ్ కుమార్ ఉన్నారు. రాజకీయంగా అవసరమైనంతమేర చురుగ్గా ఉండకపోవడంతో ఆయన స్థానంలో కేశవరెడ్డిని దింపాలని పార్టీ భావిస్తోంది. ఒప్పించే బాధ్యతను కాటసానితోపాటు కర్నూలు జిల్లా నేతలపై ఉంచింది. పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్ పరిధిలోని శిశుమందిర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేయడంతో బీజేపీ ఆయనపై దృష్టిసారించింది. రానున్న ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా బరిలోకి దించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సెటిలర్ల ఓట్లు అధికంగా ఉండటంతో ఇక్కడినుంచి సులువుగా గెలుస్తారని బీజేపీ భావిస్తోంది. మరి కేశవరెడ్డి ఏ పార్టీలో చేరతారో వేచిచూడాలి మరి.!!