కేంద్ర మంత్రివర్గం సమావేశంలో...ఎపికి సంబంధించి కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నక్సల్స్ ప్రాంతాల్లో మొబైల్ అనుసంథానాన్నిపెంచడంతో పాటు విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు ఇచ్చిన రుణంపై అపరాధపు వడ్డీని రద్దు చేయడం వంటి కీలక నిర్ణయాలను ఈ క్యాబినెట్ భేటీలో తీసుకోవడం జరిగింది.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ఈ క్యాబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకోగా మరి కొన్నింటిపై నిర్ణయం వచ్చే సమావేశంకు వాయిదా వేశారు.

బుధవారం మోడీ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపే నిర్ణయాల్లో ఒకటి...నక్సల్స్ ప్రాంతాల్లో మొబైల్ అనుసంథానాన్నిపెంచడం... పది నక్సల్స్ బాధిత రాష్ట్రాల్లో మొబైల్ అనుసంథానతను పెంచాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం రు.7,330 కోట్లతో 4,072 మొబైల్ టవర్లను నెలకొల్పనున్నారు. మొదటి దశలో రు.3,167 కోట్ల ఖర్చుతో 2,329 మొబైల్ టవర్లను ఇప్పటికే నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వం నెలకొల్పబోయే అదనపు టవర్లను ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగానే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
అలాగే విశాఖపట్నం పోర్టు ట్రస్టు, పారాదీప్ పోర్ట్ ట్రస్టులకు ఇచ్చిన ప్రభుత్వ రుణాలపై అపరాధపు వడ్డీని రద్దు చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ ప్రకారం విశాఖపట్నం పోర్టు ట్రస్టుకు సంబంధించి ప్రభుత్వం 2017 మార్చి 31నాటికి వున్న రు.250.89కోట్ల అపరాధపు వడ్డీని కేంద్రం రద్దు చేసింది. ఇంకా అపరాధపు వడ్డీలో 0.25శాతం పెనాల్టీని పోర్టు చెల్లించాల్సి వుంది. అయితే, పోర్టు రు.44.69కోట్ల అపరిష్కృత రుణం, దానిపై వడ్డీని 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఒకే వాయిదాలో చెల్లించాల్సి వుంది.












Click it and Unblock the Notifications