జగన్ సమక్షంలో వైసీపీలోకి వావిలాల సరళ దేవి-లోకేష్ సమక్షంలో టీడీపీలోకి కాండ్రు శ్రీనివాసరావు..
ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ మధ్య కాలంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య చేరికలు లేవని భావిస్తున్న తరుణంలో ఇవాళ ఓ రెండు కుటుంబాలు పార్టీలు మారాయి. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఈ రెండు కుటుంబాలు జగన్, లోకేష్ సమక్షంలో పార్టీలు మారాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మహిళా నేత, వావిలాయ గోపాలకృష్ణయ్య కుటుంబానికి చెందిన వావిలాల సరళాదేవి ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్న ఆమె .. అక్కడ తగిన గుర్తింపు లభించకపోవడంతో వైసీపీలో చేరిపోయారు. ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి, ఆమె భర్త వావిలాల వెంకట రమేష్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత కాండ్రు శ్రీనివాసరావు తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో స్ధానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయానికి కృషిచేసిన శ్రీనివాసరావు.. ఆ తర్వాత ఆయన పట్టించుకోకవడంతో పార్టీకి దూరమయ్యారు. ఇవాళ ఆయన టీడీపీ యువనేత నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్.. మరోసారి అక్కడి నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాండ్రు చేరిక ఆయనకు ఉపకరించనుంది.













Click it and Unblock the Notifications