కొత్త పార్టీయే: కిరణ్ లిస్ట్ ప్రిపేర్, కేంద్రమంత్రుల వారింపు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీకే మొగ్గు చూపుతున్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కిరణ్ సుదీర్ఘ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కలిసొచ్చే వారి కోసం ఆయన మదింపు వేగవంతం చేశారు. కొత్త పార్టీ పెడితే కలిసి వచ్చే వారి లిస్టును జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నేతలను గుర్తిస్తున్నారు. లోకసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ ప్రారంభమైన వెంటనే రాజీనామా చేయనున్నారు.
ముఖ్యమంత్రి పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆయన అప్పుడే రాజీనామా చేయనున్నారు. నేతలతో జరిగిన భేటీలో కిరణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. సమైక్య పోరాటంలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మడం లేదని కిరణ్ వ్యాఖ్యానించారట. ఎఫిఎన్జీవోల ధర్నాకు వెళ్లవద్దని నిర్ణయించుకున్నారు. కేంద్రమంత్రులు పళ్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో కిరణ్ ఏకాంతంగా చర్చలు జరిపారు. రాజీనామా విషయంలో తొందర వద్దని బిల్లును తాము అడ్డుకుంటామని కేంద్రమంత్రులు చెప్పారని సమాచారం.

పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి టి.బిల్లును ఇంకా ప్రతిపాదించలేదని వాదిస్తున్నదని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన చెప్పారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ జాతీయ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, గందరగోళ పరిస్థితుల్లో తొందరపడి టి.బిల్లు ఆమోదించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన అంశమూ చర్చకు వచ్చింది.
ప్రతిపక్షాల నుంచి వస్తోన్న వ్యతిరేకతనూ ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చాయి. ఇలా ఉండగా ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఖచ్చితంగా రాజీనామా చేస్తారని మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, గంటా శ్రీనివాస్ సమావేశం అనంతరం వెల్లడించారు. మరోవైపు విభజన విషయంలో కోర్టు మెట్లు కూడా ఎక్కేందుకు కిరణ్ సిద్ధమవుతున్నారట. ఆయన కోర్టును ఆశ్రయించక పోయినా ఆయన వర్గం ఆశ్రయించనుంది.
కాగా, భేటీ అనంతరం వీరశివా రెడ్డి మాట్లాడుతూ... ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త పార్టీని పెట్టాలని ముఖ్యమంత్రికి సూచించినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి తనతో అన్నారన్నారు. రాజీనామా చేయాలని ముఖ్యమంత్రికి సూచించినట్టు మంత్రి శతృచర్య విజయరామ రాజు తెలిపారు. ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని అన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ సోమవారం మరోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చర్చించనున్నట్టు చెప్పారు.
విభజన జరగకున్నా కొత్త పార్టీని స్థాపించాలని ముఖ్యమంత్రికి సూచించినట్టు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. పార్టీ పెట్టే విషయంలో తొందర పడవద్దని ఎమ్మెల్యే మస్తాన్‌వలీ తెలిపారు. శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు కూడా రాజీనామా చేసి కొత్తగా పార్టీ పెట్టాలని సూచించినట్టు సమాచారం.
సమావేశానికి టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, శతృచర్ల విజయరామరాజు, కాసు కృష్ణారెడ్డి, పార్థసారథి, ఎమ్మెల్యేలు గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, డివై దాస్, ఉషారాణి, శేషారెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, కమలమ్మ, వీరశివారెడ్డి, విజయ్‌కుమార్, జనార్థన్ దాట్రాజ్, ఎల్లంపల్లి శ్రీనివాస్, జివి శేషు, కన్నబాబు, లబ్బి వెంకటస్వామి, ముత్యాల పాప, కుతూహలమ్మ, మల్లాది విష్ణు, ఈలి నాని, కొర్ల భారతి, కెవివి రెడ్డి, సురేష్, పూతలపట్టు రవి, రౌతు సూర్యప్రకాష్, తోట త్రిమూర్తులు, కొడుమూరి మురళీకృష్ణ, ఎలమంచలి రవి, చింతలపూడి వెంకట్రామయ్యలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications