జగనే వెనుకబడ్డారు, 2ప్లాన్స్: కిరణ్‌ని ఏకిపారేసిన డొక్కా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మంగళవారం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కిరణ్ వ్యూహాలు ఇవి అంటూ ఆరోపించారు. కొత్త పార్టీ ద్వారా ఏఐసిసి నాయకుడిగా వచ్చేందుకు, సమైక్య ఛాంపియన్ అనిపించుకునేందుకు ఆయన వద్ద ప్లాన్ 1, ప్లాన్ 2 రెండు ఉన్నాయని, వాటిలో ఏది జరుగుతుందో తనకు తెలియదన్నారు.
కిరణ్ ఎత్తులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనుకబడిపోయారన్నారు. కిరణ్ సమైక్య ముసుగులో ఉన్న విభజనవాది అని మండిపడ్డారు. కొందరు అధిష్టానం పెద్దలతో లాలూచీ పడి విభజనకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్యాకేజీని అడ్డుకొని పార్టీ పెట్టిన ఏడాది తర్వాత కాంగ్రెసు పార్టీలో కలిసిపోతారన్నారు.

అదే ఆయన వ్యూహమన్నారు. ఇద్దరు సీనియర్ నేతల సూచనల మేరకు కిరణ్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఆయన పార్టీ పెట్టరని, ప్రెస్ మీట్లు మాత్రం పెడతారని ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టినా కాంగ్రెసులో కలిపేసి ఏఐసిసి నాయకుడిగా వస్తారన్నారు. విభజనకు కిరణే కారకులన్నారు. తెలంగాణకు ప్యాకేజీని అడ్డుకొని విభజనకు కారకుడయ్యారన్నారు. ప్యాకేజీలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి సిఎం పదవిని వదులుకోవాల్సి వస్తుందని ఆయన ప్యాకేజీని అడ్డుకున్నారని ఆరోపించారు.
ఇద్దరు కాంగ్రెసు నాయకుల సహకారం కిరణ్‌కు ఉందని ఆరోపించారు. కిరణ్ లగేజీ సర్దుకునేందుకే రాజీనామాను వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కిరణ్ రాజీనామా చేసి రాజకీయాలకు దూరం జరిగినా, కొత్త పార్టీ పెట్టినా మళ్లీ రీ ఎంట్రీ కాంగ్రెసులోకే అన్నారు. ఆర్నెళ్ల ముందే కిరణ్ రాజీనామా చేసి ఉంటే విభజన ఆగి ఉండేదన్నారు. తాము నిజం చెబితే అపార్థం చేసుకుంటారని విమర్శించారు.
కొత్త పార్టీ గురించి తెలియదు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ విషయం తనకు తెలియదని మంత్రి శైలజానాథ్ అన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెసు వాదినేనని చెప్పారు.
రేపు కిరణ్ రాజీనామా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు రాజీనామా చేయనున్నారని సమాచారం. ఈ రోజే రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, రేపు ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications