తెలంగాణ బిల్లు: 5న కిరణ్‌కు ప్రణబ్ అపాయింట్‌మెంట్
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ నెల 5వ తేదీన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్‌మెంట్ దొరికింది. బుధవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు రాష్ట్రపతితో ముఖ్యమంత్రి, సీమాంధ్ర మంత్రులు భేటీ కానున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ తిరస్కరించినందున ఆ బిల్లును పార్లమెంటుకు పంపవద్దని కిరణ్, సీమాంధ్ర నేతలు రాష్ట్రపతిని కోరనున్నారు.
కాగా, ఇందిరా గాంధీ సమాధి అయిన శక్తి స్థల్ వద్ద సమైక్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు దీక్ష చేపట్టనున్నారు. వారు మూడు గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు.

ఈ నెల 5వ తేదీన రాష్ట్రపతితో అపాయింటుమెంట్ కుదిరిందని మంత్రి శైలజానాథ్ చెప్పారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర మంత్రులు, ఇతర నేతలం రాష్ట్రపతిని కలిసి బిల్లును పార్లమెంటుకు పంపించవద్దని కోరుతామన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కూడా తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ నుండి మిశ్రమ స్పందన వస్తోందని చెప్పారు.
అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి
బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీరును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపి సిఎం రమేష్ ఢిల్లీలో తెలిపారు. తాము చెబుతున్న సమన్యాయానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని, విభజన బిల్లును అడ్డుకుంటామని తమతో చెబుతున్నాయని చెప్పారు. తాము కలిసిన జాతీయ పార్టీల నేతలంతా విభజన సరికాదని అభిప్రాయపడుతున్నారని ఆయన తెలిపారు.
అవిశ్వాస నోటీసు
విభజనకు నిరసనగా ఈ నెల 5న యూపిఏకు వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస నోటీసు ఇస్తామని గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు తెలిపారు. విభజనపై బిజెపి స్వరం మారినందున బిల్లు పార్లమెంటుకు రాదని భావిస్తున్నామన్నారు. అయితే, అసెంబ్లీ తిప్పి పంపిన విభజన బిల్లుపై హోంశాఖ న్యాయ సహాయం కోరుతుందో లేదో చూడాలని చెప్పారు. సిఎం సహా అందరం రాష్ట్రపతిని కలసి బిల్లును ఆమోదించవద్దని కోరతామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications