కిరణ్ రెడ్డి రాజీనామా వాయిదా: 31 మంది హాజరు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వ్యవహారం మరోసారి వాయిదా పడింది. సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులతో ఆయన ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని సీమాంధ్ర శాసనసభ్యులు అంటూనే ఎప్పుడు రాజీనామా చేస్తారనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
ఆదివారంనాడు జరిగిన సమావేశానికి 25 మంది శాసనసభ్యులు, ఆరుగురు మంత్రులు హాజరయ్యారు. సీమాంధ్ర నుంచి మంత్రులు, కాంగ్రెసు శానససభ్యులు కలిపి మొత్తం 83 మంది ఉన్నారు. సమావేశానికి 52 మంది హాజరు కాలేదు. ఇంకా పదవిలో ఉండాలని లేదు గానీ అందరం కలిసే నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి మరోసారి వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా, రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు రాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని సమావేశానంతరం శాసనసభ్యుడు వీరశివారెడ్డి చెప్పారు. రాజీనామా అంశంతో పాటు కొత్త పార్టీ ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామాతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే యోచనలో కేంద్రం ఉందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డ కచ్చితంగా పార్టీ పెడతారని సీమాంధ్రకు చెందిన మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డ చెప్పారు. కొత్త పార్టీ స్థాపించిన తర్వాతనే తమ కార్యాచరణ ఉంటుందని ఆయన సమావేశానంతరం చెప్పారు. కార్యకర్తల నిర్ణయం మేరకు ఏ పార్టీలో చేరాలో చూస్తామని ఆయన అన్నారు. బిల్లు లోకసభలో పెట్టలేదన బిజెపి చెప్పడం వల్లనే ముఖ్యమంత్రి ఇంకా రాజీనామా చేయలేదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో చర్చకు రాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమని మంత్రి శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. లోకసభలో పార్లమెంటు సభ్యులపై జరిగిన దాడే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications