పార్టీ కన్నాప్రజలే, రిజైన్ ఆప్షన్, అర్థం చేసుకోలేదు: కిరణ్
హైదరాబాద్: తమకు పార్టీ కన్నా ప్రజా ప్రయోజనాలే ఎక్కువ అని, తమ పోరాటం ధిక్కారం కాదని, రాష్ట్ర సమైక్యత కోసం రాజీనామా తనకు ఉన్న ఒక ఆప్షన్ అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. విభజించాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల పరంగా వచ్చే లబ్ధి శూన్యమని, పైగా ఈ ఎన్నికల్లోనేగాక సుదీర్ఘ కాలం రాష్ట్రంలో పార్టీకి చావుదెబ్బ తప్పదన్నారు. రాష్ట్ర విభజనను ఆపడానికి రాజీనామా సహా ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
విభజనకు సంబంధించిన అసలు సమస్యను మన్మోహన్, సోనియా గాంధీ అర్థం చేసుకోలేదని, దాదాపు పాతికేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్న తాము ఇప్పుడు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నామన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడం లేదన్నారు. అదే తనను కలచివేస్తోందన్నారు. తమ పోరాటం ధిక్కారం కాదని, ఈ పదవులు సోనియా పుణ్యమే అన్నారు. విభజనను ప్రతిపాదించడం ద్వారా సోనియా, మన్మోహన్ ఎంత తీవ్రమైన తప్పు చేశారని, ఈ నిర్ణయంతో ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలనుందని చెప్పారు.

రాష్ట్రపతి పంపిన రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో, మండలిలో కూడా తిరస్కరించామని, అయినా దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు చూడడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ అభిప్రాయంతో పని లేనప్పుడు విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఇదే బిల్లును తమిళనాడు, కర్ణాటక అసెంబ్లీలకు పంపాల్సిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకూడదని సిఎం కోరారు.
పార్లమెంట్‌లో బిల్లును తమ ఎంపీలు, కేంద్ర మంత్రులు అడ్డుకుంటారని తెలిపారు. కేంద్రం, కాంగ్రెస్ అసెంబ్లీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన అనేది కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమని, అసెంబ్లీ అనుమతి లేకుండా ఇంతవరకూ దేశంలో ఎక్కడా రాష్ట్రాల విభజన జరగలేదని వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తన పోరాటంలో భాగంగా రాజీనామాసహా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు.
ప్రజల ఆకాంక్షతో పోలిస్తే రాజీనామా, అధికారం, ముఖ్యమంత్రి పదవి తనకు లెక్కలోకి వచ్చేవి కాదని, వ్యక్తి కంటే పార్టీ ఎక్కువని కానీ, పార్టీతో పోలిస్తే ప్రజలే ఎక్కువ అని చెప్పారు. పదవి గురించి తనకు ఎలాంటి భయం, ఆందోళన లేదన్నారు. తాను శాశ్వత సిఎంని కాదని రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రినని, 17వ, 18వ, 20వ ముఖ్యమంత్రులు కూడా వస్తారని, విభజనకు తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పారు.
రాష్ట్ర సమైక్యతకు పోరాడాలని నిర్ణయించుకున్నప్పుడే అన్నిటికీ సిద్ధమయ్యానని, రాజీనామా ఒక ఆప్షన్ మాత్రమే అన్నారు. సిఎంగా ప్రజల మనోభావాలను వెల్లడించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సమస్యను తెలియజేయడానికే పోరాటం చేపట్టామని, విభజనను రాష్ట్రం వ్యతిరేకించినప్పుడు కేంద్రంగానీ, పార్టీలుగానీ దానిని ముందుకు తీసుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జంతర్‌మంతర్ దగ్గర తన ధర్నాతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
రాజకీయంగా తప్పొప్పుల కన్నా ప్రజలను సమైక్యంగా ఉంచటమే తన లక్ష్యమని చెప్పారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో పెడితే రాజీనామా చేసే అవకాశం ఉందని, అయితే, దాదాపు 80 మంది కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తనకు 55 సంవత్సరాల తర్వాత ఈ నగరంతో సంబంధం లేదంటే పరిస్థితి ఏమిటన్నారు. విభజన విషయంలో తప్ప అధిష్టానంతో తాను ఎందులోను వ్యతిరేకించలేదన్నారు.












Click it and Unblock the Notifications