బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు ప్రయత్నాలు : కిరణ్ రోల్ ఫిక్స్..!?
మాజీ సీఎం కిరణ్ బీజేపీలో చేరారు. వరుసగా పార్టీ అగ్ర నేతలతో సమావేశం అయ్యారు. ఏపీ బీజేపీ చీఫ్ తో ఢిల్లీలో సమావేశం అయిన కిరణ్..హైదరాబాద్ లో తెలంగాణ పార్టీ చీఫ్ తో సమావేశం కానున్నారు. ప్రస్తుతం కిరణ్ సేవలను కర్ణాటకలో వినియోగించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణ వ్యతిరేకించిన నేతగా ఆ రాష్ట్ర బీజేపీకి కిరణ్ బాధతల్లో ఉంటే పార్టీకి నష్టమా - లాభమా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఇక ఏపీలో కిరణ్ ప్రభావం ఉంటుందా. పొత్తుల లెక్కల వేళ కిరణ్ పాత్ర ఏంటి.
బీజేపీ ముఖ్య నేతలతో భేటీ: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మఖ్య నేతలు ఎవరూ లేకుండానే ఆయన చేరిక పూర్తయింది. ఇదే సమయంలో కిరణ్ కు కర్ణాటక ఎన్నికల్లో ప్రస్తుతం బాధ్యతలు చూసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఏపీ - తెలంగాణలోనూ పార్టీ వ్యవహారాల్లో కిరణ్ కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణను కిరణ్ వ్యతిరేకించారు.రాష్ట్ర విభజన సాధ్యం కాదంటూ వాదించారు. బీఆర్ఎస్ నేతలు పలు మార్లు కిరణ్ చేసిన నాటి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణ నేతలు కిరణ్ తమ రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అంగీకరిస్తారా. సహకారం తీసుకుంటారా.

ఏపీలో కిరణ్ ప్రభావం ఉంటుందా: ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసారు. రాష్ట్రం మొత్తం పర్యటించారు. ఒక్క సీటు కూడా గెలవలేదు. తన సోదరుడు కిషోర్ ను తన సొంత నియోజకవర్గం పీలేరు నుంచి బరిలోకి దించారు. అక్కడా ఓడిపోయారు. ఆ తరువాత తిరిగి కాంగ్రెస్ లో చేరిన కిరణ్ వైసీపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు తిరిగి రావాలని కోరారు. ఒక్కరూ రాలేదు. ఇప్పుడు కిరణ్ కూడా పార్టీ వీడి బీజేపీలో చేరారు. ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ కిరణ్ చేరిక ద్వారా ఏం ఆశిస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్. కిరణ్ తొలి నుంచి జగన్ తో వ్యతిరేకంగా ఉన్నారు. బీజేపీ అధి నాయకత్వం జగన్ తో సన్నిహితంగానే ఉంటోంది. కిరణ్ ఏపీలో పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారని చెప్పటం ద్వారా..పార్టీ పరంగా ఇచ్చే బాధ్యతల పైనా చర్చ సాగుతోంది.
పొత్తుల వేళ కిరణ్ చెప్పేదేంటి..: రాజకీయంగా కిరణ్ కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ తోనే ఉంది. కిరణ్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో అవిశ్వాసం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు సహకరించటంతో కిరణ్ ప్రభుత్వం పడిపోకుండా నిలబడిందని వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. అదే విధంగా చంద్రబాబుతోనూ తొలి నుంచి కిరణ్ వ్యతిరేకంగా ఉండేవారు. కానీ, సీఎం అయిన తరువాత, ఆ తరువాత కొంత మార్పు వచ్చిందనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో ఇప్పుడు టీడీపీ - జనసేన తిరిగి 2014 తరహాలో ఏపీలో బీజేపీతో కలిసి పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీలో చేరిన కిరణ్.. అటు జగన్ కు వ్యతిరేకంగా ఈ పొత్తు విషయంలో ఎలా వ్యవహరిస్తారు.. కిరణ్ మాటకు బీజేపీ నాయకత్వం ఎంత వరకు విలువ ఇస్తుందీ..బీజేపీ రాజకీయంలో కిరణ్ నిలదొక్కుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications