టీపై కిరణ్ రెడ్డి వ్యూహం: గడువుపై రాష్ట్రపతికి లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందరూ అనుకున్నట్లే చేశారు. ఈ విషయంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమై 21తో ముగియనున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత దానిని దృష్టిలో ఉంచుకుని జనవరి 23 నుంచి మరో నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి 23 వరకూ గడువు కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకూ బిల్లును ఢిల్లీకి పంపకుండా ఆపగలిగితే ఎన్నికల్లోపు విభజన జరగదన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుక్రవారం లేఖ రాశారు. బిల్లుపై అభిప్రాయాలను చెప్పేందుకు శాసనసభకు ఇచ్చిన గడువు ఈ నెల 23తో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బిల్లుపై అభిప్రాయాలను తెలిపేందుకు ఇచ్చిన వ్యవధి సరిపోదని, మరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని కోరుతూ ముఖ్యమంత్రి శుక్రవారం లేఖ రాశారు.

లేఖ తాను రాసినప్పటికీ ఇది తమ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా లేఖను రాష్ట్రపతికి పంపించారు. చర్చకు వీలుగా డిసెంబర్ 10నుంచే సభను సమావేశ పరిచామని, పలు పార్టీల, సభ్యుల గొడవవల్ల అంతరాయం ఏర్పడిందని ఆయన లేఖలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సభావ్యవహరాల కమిటీ(బీఏసీ)లో చర్చించిన మీదట మూడు విడతల్లో అభిప్రాయ సేకరణ కు నిర్ణయించామని, కొద్ది రోజులుగా సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించే ప్రక్రియ కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.
శాసనసభ్యులు ప్రాంతాలవారీగా సభ్యులు మాట్లాడాల్సి ఉందని బిల్లుకు అనేక మంది సభ్యులు సవరణలు కూడా సూచించినందున వాటిపైనా చర్చ అవసరమవుతుందని వివరించారు. అందరికీ సమాన అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున 23వ తేదీలోపు సాధ్యం కాదని తెలిపారు. మిగిలింది ఐదు రోజులే అయినందున పూర్తి చేయలేమని ఆయన చెప్పినట్లు సమాచారం. గతంలో కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 45 రోజులు గడువు ఇచ్చి తర్వాత మరో 25 రోజులు పొడిగించారని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. ఏకాభిప్రాయం ఉన్న రాష్ట్రాలకే అంత వ్యవధి ఇచ్చినందు వల్ల భిన్నాభిప్రాయాలు ఉన్న చోట స్వల్ప వ్యవధి సరిపోదని ఆయన రాష్ట్రపతికి చెప్పారు.












Click it and Unblock the Notifications