టి: సుప్రీంపై కిరణ్ డైలమా, బొత్స, మంత్రులతో కల్సి దీక్ష
హైదరాబాద్: అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేస పెట్టేందుకు సిఫార్సు చేయవద్దంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విన్నవించాలని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు నిర్ణయించారు. పలువురు నేతలు శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కిరణ్‌తో కలిసి వ్యూహరచన చేశారు. ఈ నెల 5న రాష్ట్రపతిని కలిసేందుకు సీమాంధ్ర నేతలకు అపాయింటుమెంట్ దొరికినట్లుగా తెలుస్తోంది. కిరణ్ నేతృత్వంలో వీరు కలవనున్నారని తెలుస్తోంది.
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరు ఒక్కతాటిపై వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమతో తీసుకు వెళ్లాలని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. వారికి ఆహ్వానం పంపించనున్నారని సమాచారం. వారు కలిసి రాకపోతే కాంగ్రెసు నేతలు ఒంటరిగా వెళ్లనున్నారు.

ఇక సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కూడా చూస్తున్నారు. అయితే, పిటిషన్‌ను ప్రభుత్వం తరఫున వేయాలా లేక ముఖ్యమంత్రిగా కిరణ్ వేయాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. విభజనను బీహార్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తిరస్కరించినా నాడు లోక్‌సభలో పునర్వ్యవస్థీకరణ బిల్లు పెట్టారంటూ చేస్తున్న వాదన సరికాదని, బీహార్ విభజనకు, ఈ విభజనకు పోలికే లేదని కిరణ్ చెబుతున్నారట.
బీహార్ అసెంబ్లీ 1998లో రాష్ట్ర విభజనను తిరస్కరిస్తూ తీర్మానం చేసినా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారని కానీ, బీహార్ పరిస్థితి వేరని, బీహార్ అసెంబ్లీ 1997లోనే రాష్ట్ర విభజనకు సానుకూలంగా తీర్మానం చేసిందని, దానిని పక్కన పెట్టిన కేంద్రం 1998లో మళ్లీ విభజన బిల్లును పంపిందని, దానిని బీహార్ అసెంబ్లీ తిరస్కరించిందని దీంతో, అంతకుముందు పక్కన పెట్టిన 1997లోని పాత తీర్మానం ఆధారంగా కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టిందని చెబుతున్నారు.
పంజాబ్ విభజనకు ముందు కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా విభజన తర్వాత హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగడ్ ఎన్నికల తర్వాత వారు మళ్లీ కోర్టుకు వెళ్లలేదని తెలిపారు. దీంతో, విభజన వివాదం సద్దుమణిగిందని ఈ సమావేశంలో కిరణ్ గుర్తు చేశారట. రాష్ట్ర విభజన బిల్లును ఉభయ సభలూ తిరస్కరించినందున న్యాయపరంగా కేసు బలీయంగా ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నప్పటికీ ఎవరూ నూటికి నూరు శాతం గ్యారెంటీ ఇవ్వడం లేదని, విభజనను వ్యతిరేకిస్తూ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు
పార్టీలు రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నాయని, అలాగే మనం కూడా నిష్ణాతులైన రాజ్యాంగ నిపుణులను సంప్రదించాలని కిరణ్ వారితో అన్నారట. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద ఒక్కరోజు మౌన దీక్ష చేయనున్నారు. రాష్ట్రపతి ఇచ్చే సమయాన్ని బట్టి ఈ తేదీ ఖరారు చేస్తారు. ఈ దీక్షలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.












Click it and Unblock the Notifications