సిఎం రాజీనామా చేస్తానన్నాడు, ఆగమన్నా: లగడపాటి
విజయవాడ: రాష్ట్ర విభజన బిల్లు మంత్రి వర్గ ఆమోదం పొందిన వెంటనే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనతో చెప్పినట్లు కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఆయన శనివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. రాజీనామా చేయడానికి ఈ నెల 21వ తేదీ వరకు ఆగాలని తాను సూచించినట్లు ఆయన తెలిపారు.
వేర్పాటువాదులు ముఖ్యమంత్రి కాకుండా శాసనసభను రద్దు చేయాలని తాను సూచించానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆయన అన్నారు. మంత్రులతో, శాసనసభ్యులతో కిరణ్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని ఆయన అన్నారు. కిరణ్ రెడ్డి పార్టీ పెడితే తాను అందులో చేరుతానని చెప్పారు.

కిరణ్ కుమార్ రెడ్డి తనకు సహకరించినవారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోకుండా ఏం చేసినా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే తాను అండగా నిలుస్తానని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డికి సస్పెండ్ చేయాలని శుక్రవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అనుకున్నారని, అయితే హీరో అవుతారని ఆగిపోయారని ఆయన అన్నారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు అవమానానికి గురయ్యారని ఆయన అన్నారు. వారు కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలని లగడపాటి అన్నారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టలేదని ఆయన అన్నారు. ప్రజల అభిప్రాయాలను లెక్క చేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన అన్నారు. బిల్లును అడ్డుకోవడానికి తమ వద్ద ఇంకా అస్త్రాలున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications