జగన్‌తో కిషన్ రెడ్డి లింక్: టిడిపితో పొత్తు గేమ్

తెలుగుదేశం పార్టీతో పొత్తు చర్చలు ముగిశాయని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని జి. కిషన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెసుకు ప్రయోజనం చేకూర్చడానికి కావాలని కిషన్ రెడ్డి ఆ ప్రకటన చేశారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఆ మాట అన్నట్లు టైమ్స్ అఫ్ ఇండియా రాసింది.
టిడిపి మాదిరిగా బిజెపి కుటుంబ సభ్యులతో నడవదని, నిర్ణయాలన్నీ జాతీయ స్థాయిలో నాయకత్వం సమిష్టిగా తీసుకుంటుందని, తాను పార్టీ నిర్ణయాన్ని మాత్రమే వ్యక్తం చేశానని కిషన్ రెడ్డి అన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. చర్చలు ముగిసిన తర్వాత వారిని ఎత్తిచూపాల్సిన అవసరం తమకు ఉంటుందని ఆయన అన్నారు.
బిజెపి తెలుగుదేశం పార్టీకి పొత్తు ఖరారుపై సోమవారం వరకు గడువు ఇచ్చింది. సోమవారంతో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం తెలంగాణ నాయకులు, బిజెపి నాయకులు ఢిల్లీ వెళ్లారు. నాగం జనార్దన్ రెడ్డి, సిహెచ్ విద్యాసాగర రావు వంటి నాయకులు తెలుగుదేశంతో పొత్తును ఆశిస్తుండగా, కిషన్ రెడ్డి మాత్రం చెడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారంనాడు జరిగిన తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశంలో కిషన్ రెడ్డి పాత్రపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కిషన్ రెడ్డి వ్యవహారాన్ని బిజెపి జాతీయ నాయకులకు తెలియజేయాలని చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు చెప్పినట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డికి కిషన్ రెడ్డి సన్నిహితంగా ఉంటూ వచ్చారని, ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే ఉద్దేశంతోనే తమతో పొత్తుకు నిరాకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications