విభేదాలా: వెంకయ్య సభకి కిషన్ డుమ్మా, బెంగళూరుకు

వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి అయ్యాక శనివారం మొదటిసారి హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బిజెపి కార్యాలయంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపి బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరు కాలేదు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన బెంగళూరు వెళ్లారని సమాచారం. అయితే ఈ గైర్హాజరీకి విభేదాలే కారణమని అంటున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య
తిరుమల శ్రీవారిని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు. మే 1న నరేంద్ర మోడీ తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీర్వచనాలు అందుకొని ఎన్నికల్లో విజయం సాధించారన్నారు.
దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి సమర్థవంతమైన నాయకుడు కావాలని, అందుకే ప్రధానిగా మోడీని దేవుడిచ్చిన వరంగా, జనం మెచ్చిన నాయకుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. విడిపోయినా తెలుగు ప్రజలు కలిసి ఉండాలన్నారు. రెండు ప్రాంతాల్లో అభివృద్ధి కావాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. తిరుమల పవిత్రతను అందరు కాపాడుకోవాలన్నారు. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా ఆపడానికి గతంలో పోరాడానని, ఇప్పుడు కేంద్రం నుండి సహకారం అందిస్తామన్నారు. తిరుపతిని అభివృద్ధి చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications