కేసీఆర్, చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తొలిసారిగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అంశంపై స్పందించారు. పేరు మార్చడంపై కొందరు నిరాహారదీక్షలు చేస్తున్నారని, వారికి తాను ఒక విన్నపం చేస్తున్నానన్నారు. ఎన్టీఆర్ పేరు వాడుకొని రాష్ట్రాన్ని పరిపాలించారని, ఆయన రక్త మాంసాలతో రాజకీయాలు చేసినవారిని తరిమికొట్టడానికి దీక్షలు చేయాలన్నారు. తనది విన్నపం లేదంటే సూచన లేదంటే హెచ్చరిక.. ఎలా అనుకున్నా పర్వాలేదన్నారు.
చంద్రబాబునాయుడు వెళ్లి తెలంగాణలో పోటీచేయడంలేదా? అని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునేవారే ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుకున్నారని, కనీసం జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టలేకపోయారన్నారు. రాజకీయాల కోసం అన్న క్యాంటిన్లు పెడుతున్నవారిని ముందుగా తరిమికొట్టాలన్నారు. పవన్ కు మద్దతిస్తానన్న చిరంజీవి వ్యాఖ్యలపై నాని స్పందించారు. అవసరం అనుకుంటే మద్దతిస్తానని చిరంజీవి అన్నారని, కానీ వపన్ కు ఆ అవసరం రాదని, ఆయనకన్నా చంద్రబాబు పెద్ద స్టార్ అని వ్యంగ్యంగా అన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పవన్ వెనక ఉన్నప్పుడు చిరంజీవి అవసరం ఉండకపోవచ్చన్నారు.

కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఆయనకు ఏపీలో ఆదరణ ఉంటుందా? లేదా? అనేదానికి కాలమే సమాధానం చెప్పబోతుందన్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ పై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, హైదరాబాద్ నుంచి తమను వెనక్కి పంపారనే భావన ఉందన్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడి సెటిలర్లు టీఆర్ఎస్ కే ఓటు వేస్తున్నారన్నారు. ఆయనకు అభ్యర్థులు దొరకుతారో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.
కొడాలి నాని పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటంతో ఈసారి ఎన్నికల్లో అతన్ని ఓడించాలనే పట్టుదలతో పార్టీ ఉంది. రావి వెంకటేశ్వరరావును ఇన్ ఛార్జిగా ఉంచారు. అయితే రావికి సీటిస్తారా? చివరి నిముషంలో మారుస్తారా? అనేదానిపై స్పష్టత రాలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే గుడివాడ నియోజకవర్గాన్ని జనసేనకు వదిలిపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.