రాజ్యసభ గెలుపుపై కొడాలి నాని, తెలంగాణ మంత్రికి శుభాకాంక్షలు
విజయవాడ: రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగిన తమ పార్టీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి గెలుపు తథ్యమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం నాడు ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా విజయ సాయిని పార్టీ అధినేత జగన్ ప్రకటించిన అనంతరం నాని విలేకరులతో మాట్లాడారు.
సాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తామే ప్రతిపాదించామని చెప్పారు. సాయిరెడ్డి తప్పనిసరిగా విజయం సాధిస్తారన్నారు. సాయిరెడ్డిని గెలిపించుకునే బలం తమ పార్టీకి ఉందన్నారు. అధికార టీడీపీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా, గెలుపు ఆపలేరన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా పోతుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బలం ప్రకారం టిడిపికి మూడు సీట్లు, వైసిపికి ఒక సీటు రానుంది. అయితే, నాలుగో సీటు దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారింది. అయితే నాలుగో సీటుకు పోటీ చేయకపోవడమే ఉత్తమమని ఇటీవలే చంద్రబాబు భావించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం
హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణలో అధికార పార్టీ తెరాసకు చెందిన శాసనసభాపక్ష కార్యాలయం (టీఆర్ఎస్ఎల్పీ)లో ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేశ్‌లు ప్రత్యక్షమయ్యారు.
అక్కడే ఉన్న తెలంగాణ తుమ్మల నాగేశ్వర రావును కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మలను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించిన కేసీఆర్... బంపర్ మెజారిటీతో గెలిపించారు. తుమ్మల ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు.
ఇదే సమయంలో రాజ్యసభకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. సాయిరెడ్డితో పాటు అసెంబ్లీకి వచ్చిన కొడాలి నాని, జోగి రమేశ్‌లు నేరుగా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి తుమ్మలకు శుభాకాంక్షలు చెప్పారు.












Click it and Unblock the Notifications