నేను మాట్లాడితే రెండురోజులు గుక్కపెట్టి ఏడుస్తారు; చంద్రబాబు జన్మలో సీఎం కాలేడు: కొడాలి నాని
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విదేశాలకు ఏపీ బియ్యం ఎగుమతి అవుతోంది, కిలో ఇరవై ఐదు రూపాయలకే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని కొడాలి నాని మండిపడ్డారు. రైతు శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని పేర్కొన్న కొడాలి నాని, చంద్రబాబును సీఎంను చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని సదరు పత్రికలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను మాట్లాడితే రెండురోజులు గుక్కపెట్టి ఏడుస్తారని, చంద్రబాబు జన్మలో సీఎం కాలేడని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు తోకపార్టీల, ఆయన పచ్చ పత్రికల కోరిక తీరదు
చంద్రబాబు ను సిఎం చేసే వరకు ఆయనకు తోకలా ఉన్న పార్టీలు, ఆయన కోసం తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని మంత్రి కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబును సీఎం చేయడం పచ్చ మీడియా వల్ల కాదని మంత్రి కొడాలి నాని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు బీహార్, ఒరిస్సా, తమిళనాడు, చత్తీస్ఘడ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి అవుతున్నట్టు కొడాలి నాని గుర్తు చేశారు.

జగన్ ను భ్రష్టు పట్టించాలని బాబు కంకణం కట్టుకున్నారు
సీఎం జగన్ గారిని భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, కానీ ఆయన కోరిక నెరవేరదని తేల్చిచెప్పారు. ఇక తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పంటలకు సంబంధించిన, పంట విక్రయాలకు సంబంధించిన అన్ని రికార్డులు ఆన్లైన్లోనే ఉంటున్నాయని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. రైతులు ఏ పంట వేశారో ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నామని, అన్ని రికార్డులు ఆన్లైన్లోనే ఉంటాయని కొడాలి నాని పేర్కొన్నారు. గతంలో ధాన్యాన్ని మిల్లులలో కొనుగోలు చేస్తే తాము అందుకు భిన్నంగా ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు.

సీఎం జగన్ బలపడతారని చంద్రబాబు దొంగ ఏడుపు
రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంటే చంద్రబాబుకు కనబడటం లేదంటూ కొడాలి నాని మండిపడ్డారు. మొత్తం 51 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసింది చంద్రబాబుకి కనబడలేదా అంటూ మంత్రి కొడాలి నాని ప్రశ్నాస్త్రాలు సంధించారు. పేదల కోసం పనిచేసే సీఎం పై ఇన్ని అబద్ధాలు ప్రచారం చేయడం దారుణమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఎక్కడ సీఎం జగన్ బలపడతారో అని చంద్రబాబు దొంగ ఏడుపు ఏడుస్తున్నారు అంటూ కొడాలి నాని మండిపడ్డారు.

చంద్రబాబు ఎంత మంది డీజీపీలను, ఎంత మంది సెక్రెటరీ లను మార్చాడో
డీజీపీ గౌతమ్ సవాంగ్ కు బదిలీ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని చంద్రబాబు ఎంత మంది డీజీపీలను, ఎంత మంది సెక్రెటరీ లను మార్చాడో చెప్పాలని నిలదీశారు. డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయడంలో ఎలాంటి రాజకీయం లేదని, ఆయన డీజీపీ పదవి లోకి వచ్చి చాలా కాలమైంది అని, వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం డీజీపీ పదవి నుండి గౌతమ్ సవాంగ్ ను మార్చారని కొడాలి నాని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని రాజకీయాలు చేసినా, ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ప్రజలు ఏమి అమాయకులు కాదని కొడాలి నాని పేర్కొన్నారు.

కుప్పంలో గెలవని చంద్రబాబు సొల్లు పురాణం
ఎన్టీఆర్ చావుకు కారణమై సీఎం పదవి తెచ్చుకున్న చంద్రబాబు, పదవిని అడ్డంపెట్టుకుని కుబేరుడు అయ్యాడని కొడాలి నాని ఆరోపణలు గుప్పించారు. కొడుకుని ఎమ్మెల్యే గెలిపించుకోలేక పోయాడు అని, కుప్పంలో సర్పంచ్ ను కూడా గెలిపించుకోలేని వ్యక్తి సొల్లు పురాణం చెబుతున్నాడని చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో టిడిపి నేతలు వైసీపీ నేతల పై చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నాని వివేకా హత్య కేసులో ఛార్జిషీట్ విషయంలో ఎవరికి నచ్చిన అంశం వాళ్లు బయటకు తెస్తున్నారని, ఆ రోజు జగన్ ఈ కేసులో కూడా అప్పుడున్న జెడి తమకు కావలసిన పత్రికలకు లీకులు ఇచ్చేవాడిని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ను టార్గెట్ చేశారు మంత్రి కొడాలి నాని.

వివేకాను చంపితే జగన్ కు ఏమొస్తుంది?
అసలు వివేకానంద రెడ్డి ని హత్య చేస్తే జగన్ కి ఏం వస్తుందో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. వైయస్ కుటుంబం దేవుడిని నమ్ముకున్న కుటుంబమని, అలాంటి కుటుంబాన్ని రోడ్డుమీదకు లాక్కొచ్చింది టిడిపి వాళ్లంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. పదవులు శాశ్వతం కాదని చరిత్ర మాత్రమే శాశ్వతమని చంద్రబాబు గుర్తించాలని హితవు పలికారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్టీఆర్, వైయస్సార్ తరహాలో చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తున్నారని కొనియాడారు. చంద్రబాబు ఏం చేయాలనుకున్నా ప్రజల మద్దతు మాత్రం జగన్మోహన్ రెడ్డికే ఉంటుందంటూ తేల్చిచెప్పారు మంత్రి కొడాలి నాని.












Click it and Unblock the Notifications