Kodali Nani : ఎన్టీఆర్ ఆదర్శమైతే వెన్నుపోటు ఎందుకు ? టీడీపీ నేతలకు కొడాలి సూటి ప్రశ్న.. !
టీడీపీపై, అధినేత చంద్రబాబుపై తరచుగా విమర్శలు చేసే వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ మరోసారి స్పందించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు చేస్తున్న హంగామాపై గుడివాడలో మాట్లాడిన నాని.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుడివాడలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. వైసీపీ నేతలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొడాలి ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరస్మరణీయ వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.
ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తుంచుకున్న ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు ఆయన పేరు పెట్టారన్నారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలతో అనేకమంది రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ తమకు ఆదర్శమంటూ నేడు కొందరు మొసలి కన్నీరు కారుస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు నేటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారన్నారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జీవితం ఆదర్శమన్నారు. గుడివాడ నుండి రెండుసార్లు అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు.












Click it and Unblock the Notifications