మచిలీపట్నాన్ని హోల్ సేల్‌గా లూటీ చేసే కుట్ర: పేర్ని నానిపై కొల్లు రవీంద్ర ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక తాజాగా మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిని టార్గెట్ చేశారు. మచిలీపట్నాన్ని పేర్ని నాని హోల్ సేల్ గా లూటీ చేయడానికి కుట్ర చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో టిడిపి హయాంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడాను ఏర్పాటు చేశామని పేర్కొన్న కొల్లు రవీంద్ర, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

ఇటీవల ముడా అధికారులు తయారుచేసిన మాస్టర్ ప్లాన్ అంతా లోపభూయిష్టంగా ఉందని, అనేక తప్పులు దొర్లాయని పేర్ని నాని పేర్కొన్నారు. మల్టీపర్పస్ జోన్ లు లేకుండా 90% రెసిడెన్షియల్ జోన్ గా మార్చారని, దీనివల్ల భవిష్యత్తు తరాలకు తీరని నష్టం చోటు చేసుకుంటుందని కొల్లు రవీంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి నేతలు సొంత ఆస్తులను కమర్షియల్ జోన్ లో పెట్టుకున్నారన్నారు.
ప్రైవేటు ఆస్తులను దోచుకునే లాగా మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాలను మాస్టర్ ప్లాన్ లో ఏవిధంగా తీరుస్తారో చెప్పలేదని, గుడిని , బడిని కూడా దోచుకునేలా తయారుచేసిన మాస్టర్ ప్లాన్ పై ప్రజలు స్పందించాలన్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి తప్పుల తడకగా ఉన్న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి టిడిపి సిద్ధంగా ఉందని చెప్పిన ఆయన, మాస్టర్ ప్లాన్ లోని అవకతవకలపై మే 9లోపు అభ్యంతరాలను తెలియజేయడానికి ప్రభుత్వం గడువు ఇచ్చిందని, ఈ లోపు ప్రతి ఒక్కరూ అభ్యంతరాలను తెలపాలని కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications