టీ ఎందుకొచ్చిందా అనిపిస్తోంది: కేసీఆర్‌పై కోమటిరెడ్డి రివర్స్, ఎర్రబెల్లి ఫైర్
నల్గొండ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన యూ టర్న్ తీసుకున్నారు! ఇటీవలి వరకు కేసీఆర్‌ను పొగిడిన కోమటిరెడ్డి శుక్రవారం నాడు మండిపడ్డారు.
కేసీఆర్ పాలన చూస్తుంటే తెలంగాణ వచ్చిందుకు బాధ కలుగుతోందని ధ్వజమెత్తారు. ఆశలు వదులుకున్న జనం తిరగబడే సమయం వస్తుందని హెచ్చరించారు. సచివాలయం, రవీంద్ర భారతి, కుల సంఘాల భవనాల నిర్మాణాలకు అంత తొందర ఎందుకని ప్రశ్నించారు.
త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెరాస కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఫ్లై ఓవర్లు, స్కై వాకర్లు అంటూ తెరాస ఊదరగొడుతోందని విమర్శించారు.

నిధుల మంజూరులో పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారు, విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపుతోందన్నారు. కేసీఆర్ అసంబద్ద పాలనపై భవిష్యత్తులో ప్రజలు తిరగబడతారన్నారు. గతంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, కానీ కేసీఆర్ మంచి పనులు చేస్తే మాత్రం విమర్శించనని చెప్పారు.
మాకు బలమైన క్యాడర్ ఉంది: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రంలో తమకు బలమైన క్యాడర్ ఉందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెరాస ప్లీనరిలో సీఎం కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడించలేదన్నారు.
టీడీపీలో ఉండి తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు ప్రభుత్వంలో పదవులలో ఉన్నారన్నారు. తెరాస ఆపరేషన్ ఆకర్ష్ ఎదుర్కొంటామన్నారు. చంద్రబాబు సభను అడ్డుకుంటే తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications