పవన్ కళ్యాణ్ గోదారి ఆశలపై కోనసీమ నీళ్లు చల్లిందా ? తడబడ్డా తేరుకున్న వైసీపీ !
ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష టీడీపీ-జనసేన ఏకమవుతున్న తరుణంలో కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరుపై చోటు చేసుకున్న హింస ఇప్పుడు వీరికి ఎదురుదెబ్బగా మారుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై భారీ ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారినట్లు క్షేత్రస్ధాయిలో పరిణామాల్ని చూస్తే అర్ధమవుతోంది.

రంజుగా ఏపీ రాజకీయం
ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపికి వ్యతిరేకంగా జత కట్టేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ,జనసేనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయాన్ని తప్పుబడుతూ వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతుండగా.. తాజాగా కోనసీమలో చోటు చేసుకున్న హింస సైతం ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం మరింత వేడెక్కబోతోంది.

గోదావరి జిల్లాలపై పవన్ ఆశలు
గోదావరి జిల్లాల్లో అధికంగా ప్రభావం చూపే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో పాటు టీడీపీకి అండగా నిలిచే కమ్మ సామాజిక వర్గంపైనా జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఈ రెండు సామాజిక వర్గాలు పూర్తిస్ధాయిలో అండగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మిగతా సామాజిక వర్గాల్ని కూడా కలుపుకుని పోవడం ద్వారా గోదావరి జిల్లాల్లో అత్యధిక స్ధానాల్ని కొల్లగొట్టాలని పవన్ భావిస్తున్నారు. కానీ దీనిపై తాజా పరిణామాలు నీళ్లు చల్లాయి.

పవన్ ఆశలపై నీళ్లు జల్లిన కోనసీమ ?
తాజాగా కోనసీమ జిల్లాల్లో అంబేద్కర్ పేరుపై చోటు చేసుకున్న హింస పవన్ కళ్యాణ్ సమీకరణాలపై దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కు అండగా నిలుస్తారని భావిస్తున్న కాపు సామాజిక వర్గానికీ, వైసీపీకి ఎప్పటినుంచో అండగా ఉన్న ఎస్సీలకూ మధ్య అంబేద్కర్ జిల్లా పేరు విషయంలో అంతర్గతంగా వార్ జరుగుతోంది. వీరికి వైసీపీకి అండగా ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గం కూడా తోడవడంతో కాపులు, శెట్టిబలిజలు వర్సెస్ ఎస్సీలుగా ఇక్కడ పరిస్ధితి మారింది. కానీ జనాభా పరంగా అధికంగా ఉన్న ఎస్సీల అండ లేకుండా జనసేనే కాదు టీడీపీ కూడా ఇక్కడ విజయం సాధించే పరిస్ధితులు లేవు. దీంతో ఇప్పుడు కోనసీమ హింస ద్వారా ఆయా సామాజిక వర్గాల మధ్యసాగుతున్న వార్ పవన్ కు కొత్త సమస్యలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది.

తడబడ్డా తేరుకున్న వైసీపీ
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో వైసీపీ సర్కార్ కు ముందునుంచీ క్లారిటీ లేదు. అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెడితే ఎలా ఉంటుందన్న దానిపై మల్లగుల్లాలు పడ్డ వైసీపీ సర్కార్.. తొలుత కేవలం కోనసీమ జిల్లాగానే ప్రకటించింది. కానీ ఆ తర్వాత వచ్చిన డిమాండ్లు, క్షేత్రస్ధాయిలో పరిణామాల్ని అంచనా వేసుకున్న వైసీపీ ఆ తర్వాత మనసు మార్చుకుంది. చివరికి కోనసీమలో హింస జరిగి తమ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపైనే దాడులు జరగడం, ఎస్సీల్లో కోనసీమ జిల్లా సాధన సమితి పోరాటాలపై పెరిగిన వ్యతిరేకత చివరికి వైసీపీకి లాభించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications