ఏపీలో ప్రజల ఆత్మహత్యలు అందుకే: మంత్రి పత్తిపాటి, రేపు ఢిల్లీకి చంద్రబాబు
అమరావతి: ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, వైసీపీలు అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టడం వల్లే ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు వద్ద రూ. 43 కోట్లతో జరుగుతున్న కొండవీడు ఘాట్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా శుక్రవారం కాంక్రీట్ పనులను ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రత్యేకహోదా, ప్యాకేజీని కేంద్రం నుంచి తీసుకువచ్చేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉందన్నారు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడును అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో రెడ్డిరాజులు పరిపాలించిన కొండవీడు ప్రాంతాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కొండవీడుని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదించారన్నారు. ఏపీకి వచ్చిన పర్యాటకులు ఖచ్చితంగా కొండవీడు కోటను సందర్శించే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇందు కోసం కేంద్రం నుంచి నిధులు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు, మండల తెదేపా అధ్యక్షుడు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
రేపు ఢిల్లీకి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లి, సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 8, 9, 10లపై ఆయనతో చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం స్థానికత పేరుతో రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల అంశంపై కూడా రాజ్‌నాథ్‌తో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications