TDP కాదంటే ఏంచేయాలో నాకు తెలుసు: కోటంరెడ్డి
కోటంరెడ్డి వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు స్పందించడంలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ నెల్లూరు జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు స్పందించలేదు. ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. టీడీపీలో టికెట్ ఖాయమేనా? లేదంటే వేరే ఇంకేదైనా ఆలోచన ఉందా? అనే చర్చ జిల్లాలో నడుస్తోంది. దీనిపై కోటంరెడ్డి స్పష్టత ఇచ్చారు.

అంకిత భావంతో పనిచేస్తా
తనకు అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానని కోటంరెడ్డి కుండ బద్దలు కొట్టేశారు. చంద్రబాబునాయుడు, లోకేష్ అవకాశం ఇస్తే పోటీచేస్తానన్నారు. అంతేకాకుండా అంకిత భావంతో పనిచేసి జిల్లాలో పది సీట్లలో టీడీపీ గెలిచేందుకు పనిచేస్తానన్నారు. రాజకీయాలు తనకు శ్వాస, ధ్యాస, ఆశ అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీ, ఇతర పార్టీలు తనను వద్దనుకుంటే బీహార్ వెళ్లి తేజస్వి యాదవ్ తో మాట్లాడి రాష్ట్రీయ జనతాదళ్ పదవి తెచ్చుకుంటానన్నారు. అది కూడా కుదరదంటే యూపీలో ములాయంసింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ను కలుస్తానని, అదీ కుదరకపోతే బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో కలిసి ఆ పార్టీలో పదవి తెచ్చుకొని, తన వాహనానికి జెండా కట్టుకొని తిరుగుతానని స్పష్టం చేశారు.

స్టాలిన్ ను కలుస్తా..
బీహార్, యూపీ వెళ్లడం కష్టం అనుకుంటే మన పక్కనే ఉన్న తమిళనాడుకు పోయి ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరకు పోయి ఆ పార్టీ పదవి తెచ్చుకుంటానన్నారు. తన నియోజకవర్గంలో తమిళ ఓటర్లు 3వేల మంది ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఉంది కదా అన్నారు. పెద్ద సంఖ్యలో సెటిలర్లు ఉన్నారని, అడిగితే ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందన్నారు. వైసీపీకి మరో 15 నెలలు అధికారం ఉందని గుర్తుచేశారు. ఒకవేళ తాను తెలుగుదేశం పార్టీలో చేరితో వైసీపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తానన్నారు. వ్యక్తిగతంగా తాను జగన్ పై కక్ష పెంచుకునే పనులకు వ్యతిరేకమని, నెలరోజుల ముందు వరకు తనకు వేరే ఆలోచనే లేదని, ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తాను ఎవరిని కలిసినా ప్రశ్నించే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి తాను మౌనంగానే నిష్క్రమిద్దామనుకున్నానని, కాకపోతే తనను రెచ్చగొట్టి ఇలా మాట్లాడేస్థితికి తెచ్చారన్నారు.

మాట్లాడాలి అంటే మాట్లాడక తప్పేది కాదు
రెండోసారి విజయం సాధించిన మొదటి మూడునెలల్లో తాను కొన్ని తప్పులు చేశానన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తాను ఇలా అధికార మదం తలకెక్కించుకోకూడదని, ఆత్మపరిశీలన చేసుకున్నానని.. తనవల్ల బాధపడినవారికి అప్పట్లోనే వారి ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పానన్నారు. తనను ఇష్టపడేవారికి, వ్యతిరేకించే వారికి ఇంటర్వ్యూ సందర్భంగా మరోసారి సారీ చెప్పారు శ్రీధర్ రెడ్డి. తాను గతంలో కొన్ని విమర్శలు చేశానని.. ముఖ్యమంత్రి జగన్ పిలిచి ఇది మాట్లాడాలని చెబితే మాట్లాడక తప్పేది కాదన్నారు. ట్యాపింగ్ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు.












Click it and Unblock the Notifications