జనసేనలోకి టీడీపీ మాజీ మంత్రి - గోదావరిలో సీట్ల కోసం ఫీట్లు..!!
గోదావరిలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో ఇక్కడ సీట్ల సర్దుబాటు సమస్యగా మారుతోంది. జనసేనాని పవన్ విశాఖ, తూర్పు గోదావరిలో తమ పార్టీ పోటీ చేసే కొన్ని స్థానాల పైన క్లారిటీ ఇచ్చారు. అవే స్థానాల్లో సీట్ల పైన ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్లు అధికారిక నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయడు జనసేనలో చేరుతున్నారు. సీట్ల సర్దుబాబు వ్యవహారం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
జనసేనలోకి సుబ్బారాయడు: నర్సాపురం సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరనున్నారు. 1989, 94, 99, 2004లో టీడీపీ నుంచి, 2012లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి మంత్రిగానూ పనిచేశారు. అయితే 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ముదునూరి ప్రసాద రాజు చేతిలో ఓడిపోయారు.

2014లో సుబ్బారాయుడు తిరిగి టీడీపీలో చేరారు. కాపు కార్పోరేషన్ చైర్మన్ గా పని చేసారు. ఆ తరువాత 2019లో వైసీపీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాల కారణంగా పార్టీ వీడారు. గతంలో ప్రజారాజ్యంలో పని చేసిన సమయం నుంచి ఉన్న సంబంధాలతో ఇప్పుడు తిరిగి జనసేనలో చేరాలని సుబ్బారాయుడు నిర్ణయించారు.
సీట్ల కోసం నేతల పోటీ: కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నుంచి సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే అక్కడ పార్టీ నేత బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్దిగా ప్రచారంలో ఉన్నారు. టీడీపీ నుంచి మాధవ నాయుడు, ఎన్నారై కొవ్వలి నాయుడు పోటీ కోసం రేసులో ఉన్నారు. ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుందని చెబుతున్నారు.
ఇప్పుడు తాజాగా సుబ్బారాయుడు ఎంట్రీతో సీటు పైన చర్చ మొదలైంది. అదే విధంగా విశాఖ, తూర్పు గోదావరిలో పవన్ తమ పార్టీకి దక్కే సీట్లుగా చెప్పిన నియోజకవర్గాల్లో టీడీపీ సీనియర్లు ఉన్నారు. తమ పార్టీ నాయకత్వంతో జనసేనకు కేటాయించే సీట్ల పైన స్పష్టత కోరుతున్నారు. పార్టీ నుంచి అధికారికంగా నిర్ణయం వచ్చిన తరువాత తమ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికి ఎక్కడ సీటు: ఇదే విధంగా తూర్పు గోదావరిలో జనసేన పోటీ చేయనున్న రాజానగరం, రాజమండ్రి రూరల్ విషయంలో టీడీపీలో పంచాయితీ నడుస్తోంది. పశ్చిమలో తాడేపల్లిగూడెంలో టీడీపీ నేత బాబ్జీ సీటు ఆశిస్తున్నారు. అక్కడ జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ తామే పోటీ చేయబోతున్నట్లు చెబుతున్నారు.
తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాక్రిష్ణ మరసారి పోటీకి సిద్దం అవుతున్నారు. అయితే, అక్కడ జనసేన నుంచి రామచంద్రరావు పోటీ ఖాయమని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఉంగుటూరులో టీడీపీ నుంచి గన్ని వీరాజంనేయులు సీటు పైన ఆశలు పెట్టకోగా, ఈ స్థానం జనసేనకు ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో..ఈ సీట్ల విషయంలో రెండు పార్టీల నుంచి వచ్చే అధికారిక ప్రకటన..భవిష్యత్ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications