బంధువులవుతున్నారు: మరోసారి కెసిఆర్-బాబులను కలపనున్న కృష్ణ!
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్) కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ)లను మరోసారి ఒకే వేదిక పైకి తీసుకు రానున్నారు. అంతేకాదు, చంద్రబాబు, సూపర్ స్టార్ కృష్ణలు బంధువులు కూడా కాబోతున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు తనయుడు రత్నబాబుకు డిసెంబర్ 23వ తేదీన పెళ్లి జరగనుంది. రత్నబాబుకు చంద్రబాబు సోదరి హైమావతి మనవరాలు ప్రియాంకతో వివాహం జరగనుంది. ఈ పెళ్లికి చంద్రబాబు, కెసిఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి.
కృష్ణ.. తన సోదరుడు ఆదిశేషగిరి రావుతో కలిసి చంద్రబాబును కలిశారు. పెళ్లి పత్రికను అందించారు. తన సోదరి హైమావతి మనవరాలి పెళ్లి కాబట్టి చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కృష్ణ తెలంగాణ సీఎం చంద్రశేఖర రావును కూడా పెళ్లికి స్వయంగా ఆహ్వానించారు.

తెలంగాణ సీఎం కెసిఆర్ ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు పెద్ద అభిమాని. ఇతను కూడా పెళ్లికి హాజరయ్యే అవకాశముంది. ఇరువురు సీఎంలు ఎప్పుడు ఒకే వేదిక పైన కనిపించినా అది చర్చనీయాంశంగా మారుతోంది. బుధవారం నాడు ఢిల్లీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కూతురు వివాహ విందులోను వారు ఎదురుపడి మాట్లాడుకున్నారు.
కాగా, కృష్ణ సోదరుడి తనయుడు రత్నబాబు, చంద్రబాబు సోదరి మనవరాలు ప్రియాంకల వివాహం డిసెంబర్ 23న జరగనుంది. ఈ పెళ్లికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. రత్నబాబు వ్యాపారాలు చూసుకుంటున్నారు. ప్రియాంక ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ నటుడు సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా అల్లుడు. కృష్ణ కూతురును ఆయన వివాహం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు, సూపర్ స్టార్‌లు కూడా బంధువులు కాబోతున్నారు.












Click it and Unblock the Notifications