కోడిపందాలపై కృష్ణా కలెక్టర్ కీలక ఆదేశాలు..! రఘురామ ప్రకటన వేళ..!
ఏపీలో ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించేందుకు జనం సిద్దమవుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈసారి కూడా ఘనంగా కోడి పందాలు నిర్వహిస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పొరుగు జిల్లా కలెక్టర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రతీ ఏటా సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించరాదని ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించడం, వాటిని ఉల్లంఘించి బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా పలు జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాలో కోడిపందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా జరిగితే కఠినంగా వ్యవహరించి కేసులు బనాయించాలని అధికారులను ఆదేశించారు.

సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు వర్డ్స్ అనిమల్స్ సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం కోడిపందాల నిషేధంపై రూపొందించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కోడిపందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరం అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో ఎక్కడా కూడా కోడిపందాలు జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కోడిపందాలు ఎక్కడ జరిగిన నిరోధించాలని చట్టం ఉల్లంఘించే వారిపై తప్పనిసరిగా కేసులు బనాయించాలన్నారు.

ఇప్పటినుండి చాలా కఠినంగా వ్యవహరించకపోతే తర్వాత సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. డివిజను, మండల, గ్రామస్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఎక్కడైనా గ్రామాల్లో కోడిపందాలు నిర్వహిస్తుంటే వెంటనే మండల స్థాయి కమిటీకి తెలియజేయాలన్నారు. డివిజన్, మండల, గ్రామస్థాయిలలో కమిటీల సమావేశాలు నిర్వహించి కోడిపందాల చట్టరీత్యా నేరం అనే విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.గతంలో కోడిపందాలు నిర్వహించే వారిని గుర్తించి బైండ్ ఓవర్ కూడా చేయాలన్నారు. డివిజన్ మండల స్థాయి కమిటీలు ప్రతి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతోపాటు అవసరమైనచోట్ల దాడులు కూడా నిర్వహించాలని సూచించారు.












Click it and Unblock the Notifications