
శ్రీశైలం - సాగర్ పై పెత్తనం ఒక బోర్డుదే : ఏపీ వాదనకే మొగ్గు-తెలంగాణ అభ్యంతరం..!!
కృష్ణా జలాల వినియోగం పైన వివాదాలకు ముగింపు పలికేందుకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టు లు గురువారం(14వ తేదీ) నుంచి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిలోకి దశలవారీగా వెళ్లిపోతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను విద్యుత్కేంద్రాలతో సహా తన స్వాధీనంలోకి తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తీర్మానించింది.

వాడీ వేడిగా బోర్డు సమావేశం
గోదావరి, కృష్ణా నదులపై తెలుగు రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునేలా కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ అమలు కోసం మంగళవారం హైదరాబాద్ జల సౌధలో కేఆర్‌ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బోర్డు ప్రత్యేక సమావేశం జరిగింది. గెజిట్ లో కేవలం 17 ప్రాజెక్టుల పాయింట్ల జాబితాను మాత్రం ప్రతిపాదించటం పైన ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశంలో వాడీ వేడిగా వాదనలు జరిగాయి. విద్యుత్కేంద్రాలతో కూడిన అవుట్‌లెట్లు లేకుండా ప్రాజెక్టుల పా యింట్లను స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రయోజనమేమిటని నిలదీశారు.

విద్యుత్ కేంద్రాల పైన తెలంగాణ అభ్యంతరం
విద్యుత్కేంద్రాలతో కూడిన అవుట్‌లెట్లు ఉండి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ 17 అవుట్‌లెట్లతోనే ముందుకు వెళ్తామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. బోర్డు ఇదే వైఖరితో ముందుకెళ్తే తాము ప్రాజెక్టులను అప్పగించబోమని ఖండితంగా చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి హాజరైన అధికారులు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో జంట జలాశయాలను కేఆర్‌ఎంబీకి స్వాధీనం చేసేందుకు ఆమోదిస్తామని.. కానీ తమ సీఎం కేసీఆర్‌తో చర్చించాక నిర్ణయాన్ని వెల్లడిస్తామని రజత్‌కుమార్ చెప్పారు.

సూత్రప్రాయంగా స్వాధీనం..నిర్ణయం
తెలంగాణ అప్పగించిన వెంటనే తాము కూడా ప్రాజెక్టులను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేస్తామని శ్యామలరావు తెలిపారు. జల వనరుల శాఖ, ఏపీ జెన్కో ఉత్తర్వులిస్తాయన్నారు. ఫలితంగా ప్రాజెక్టుల అప్పగింతపై స్పష్టత వచ్చింది. అయితే.. ఆ ప్రాజెక్టులను గురువారం నుంచి సూత్రప్రాయంగా స్వాధీనం చేసుకుంటున్నా.. పూర్తిస్థాయిలో నిర్వహణలోకి తీసుకునేందుకు 3 నెలల సంధి కాలం కావాలని కేఆర్‌ఎంబీ పేర్కొంది. దీనికి రెండు రాష్ట్రాలూ ఆమోదించాయి. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో తెలంగాణ అక్రమంగా జల విద్యుదుత్పత్తి చేయడాన్ని ఏపీ ప్రస్తావించింది.

నిర్వహణా వ్యయం పైన ఒప్పందం
బోర్డు పరిధిని ప్రకటించమనడం వెనుక కారణం ఇదేనని పేర్కొంది. 'శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తుంటే అభ్యంతరం చెప్పాం. విద్యుదుత్పత్తి ఆపాలని బోర్డు ఆదేశాలిచ్చినా తెలంగాణ పాటించలేదు. అయినా కేఆర్‌ఎంబీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక బోర్డు లు ఎందుకు' అని నిలదీసింది. కీలకమైన నిర్వహణ వ్యయంపై చర్చ జరిగింది. తాము రూ.8 కోట్లు బోర్డుకివ్వాలని నిర్ణయించామని.. ఈ మొత్తాన్ని త్వరలోనే అందజేస్తామని ఏపీ అధికారులు తెలిపారు.
Recommended Video

ఇక బోర్డు పరిధిలోకి వెళ్లే ప్రాజెక్టులు
శ్రీశైలం స్పిల్‌వే, కుడిగట్టు విద్యుత్కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, హంద్రీ-నీవా, మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు, సుంకేశుల.. నాగార్జున సాగర్ కుడికాలువ...ఇక నుంచి కేఆర్‌ఎంబీ పరిధిలోకి వెళ్లే ఆంధ్రా ప్రాజెక్టులుగా నిర్ధారించారు. అదే విధంగా.. తెలంగాణ నుంచి శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంప్‌హౌస్, నాగార్జున సాగర్ కింద ఉన్న 15 పాయింట్లు, కుడి, ఎడమ కాలువలతో పాటు ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రం, ఎడమ కాలువ కింద ఉన్న పాయింట్లు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, హైదరాబాద్ మంచినీటి సరఫరా ప్రాజెక్టు, సాగర్ టెయిల్ పాండ్ కింద హెడ్‌వర్క్స్ విద్యుత్కేంద్రం, పులిచింతల హెడ్‌వర్క్స్ విద్యుత్ బ్లాక్, ఆర్డీఎస్ క్రాస్ రెగ్యులేటర్, తుమ్మిళ్ల ఎత్తిపోతల బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి.