అప్పటి నుంచే చంద్రబాబుకు నాపై... వైఎస్ అలా కాదు: కొమ్మినేని
హైదరాబాద్: ఎన్టీవీ నుంచి తప్పుకుని సాక్షి టీవీ చానెల్‌లో చేరిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు సీనియర్ జర్నలిస్టులను లంచ్‌కు పిలిచారని, ఆ సమయంలో మీరు మారరా అంటూ తనను ప్రశ్నించారని ఆయన చెప్పారు.
తాను, తన చానెల్ ఏం తప్పు చేశామో చెప్పాలని అడిగానని, బహుశా అప్పటి నుంచే తనపై చంద్రబాబుకు వ్యతిరేక భావన ఏర్పడి ఉంటుందని ఆయన అన్నారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొమ్మినేని శ్రీనివాస రావు వైయస్ రాజశేఖర రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా గురించి చెప్పారు.
గతంలో కాకినాడ సెజ్, వాన్‌పిక్‌కు బీడు భూములు ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు రాజధాని కోసం పంటలు పండే భూములు తీసుకోవడం అశ్చర్యం కలిగించిందని, దాన్ని ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందని ఆయన అన్నారు.

చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు నచ్చకపోవడం వల్లనే ఎన్టీవీలో తన ఉద్యోగం పోయిందని ఆయన స్పష్టంగా చెప్పారు. గతంలో తాను ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు వైఎస్‌ను విమర్శిస్తూ పెద్ద యెత్తున కథనాలు రాశానని, కొన్ని సార్లు వైయస్ విధానాలను కొన్నింటిని తప్పు పడుతూ సీనియర్ జర్నలిస్టులమంతా వాదించామని ఆయన చెప్పారు.
అినా వైఎస్ ఏనాడు కూడా కక్ష సాధించలేదని ఆయన అన్నారు. చంద్రబాబు, వైఎస్ మధ్య తాను గుర్తించిన తేడా ఒకటి ఉందని ఆయన చెప్పారు. వయస్సు పెరిగే కొద్దీ వైయస్‌లో మెచ్యురిటీ స్థాయిలు పెరుగుతూ వచ్చాయని, చంద్రబాబులో రానురాను సంకుచిత భావాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
గతంలో తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబును తాను గమనించానని, కానీ ఇప్పుడున్నంత దారుణంగా అప్పట్లో ఉండేవారు కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులు స్యవంగా కండువాలు కప్పి ఫిరాయింపులను ప్రోత్సహించడదం దారుణమని అన్నారు.












Click it and Unblock the Notifications