బాబు కొలువులో విదూషకుడు: రేవంత్‌పై కెటిఆర్
న్యూఢిల్లీ: తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కొలువులో విదూషక పాత్ర పోషిస్తున్న రేవంత్‌రెడ్డి చేసే ఆరోపణలకు జవాబు చెప్పవలసిన అవసరం తమకు లేదని తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి కెటి రామారావు అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. చంద్రబాబు మెప్పు పొదటంతోపాటు ప్రచారం కోసం నిరాధారమైన ఆరోపణలు చేయటం రేవంత్‌రెడ్డికి అలవాటైపోయిందని ఆయన అన్నారు.
మెట్రో గురించి ఎవరెన్ని ఆరోపణలు చేసినా నిర్ణీత వ్యవధి కంటే ముందుగానే మొదటి దశను పూర్తి చేసి తమ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు బహుమతిగా ఇస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగాలకు కొరత ఉండదని కెటిఆర్ చెప్పారు. తన శాఖకు అనుబంధంగాఉన్న గ్రామీణ మంచినీటి సరపరా విభాగంలో వెయ్యి మందికి ఉపాధి దక్కుతుందన్నారు.

హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయటాన్ని ప్రస్తావించగా.. ఇందులో జరగరానిదేదీ జరగలేదని, గెజిట్ నోటిఫికేషన్ అసాధారణమేమీ కాదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తనకున్న సమాచారం మేరకు ఇది సాంకేతిక అంశమని తెలిపారు. ఒక మంత్రిగా తాను చెప్పాల్సినవి కొన్ని ఉంటాయని, చెప్పకూడనివి కూడా కొన్ని ఉంటాయన్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో పస ఉంటే సంబంధిత అధికారులు సమాధానమిస్తారని, సొల్లు పురాణానికి స్పష్టత ఇవ్వబోమన్నారు.
వరంగల్‌లో మూతపడిన అజాం జాహీ మిల్లు స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎన్‌టిసితో ఒక కొత్త మిల్లును ప్రారంభించటానికి అంగీకరిస్తే 50 ఎకరాల భూమిని ఉచితంగా అందచేస్తామని కేంద్ర మంత్రి గంగ్వార్‌కు తెలియచేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనకు మంత్రి గంగ్వార్ సానుకూలంగా స్పందించినట్లు కేటీఆర్ చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణ పథకం కింద తెలంగాణాలోని రామగుండం, ఖమ్మం, నిజామాబాద్‌లకు కేటాయించిన బస్సుల సంఖ్యను పెంచాలని పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడును కోరినట్లు కెటిఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications