రెండు రాష్ట్రాలకు న్యాయమని బీజేపీ చెప్పింది, తెలంగాణకు కూడా: కేవీపీ
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ నాడు వాదించిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభలో అన్నారు. నాడు రెండు రాష్ట్రాలకు న్యాయమని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలు మరిచిపోయిందని ఆరోపించారు.
వాగ్ధానాల గురించి ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వెంకటేశ్వరుని పాదాల సన్నిధిలో సహాయం అందిస్తామని నాడు ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఏఫీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హామీ ఇచ్చారన్నారు.

ప్రత్యేక హోదా విషయాన్ని రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదని విమర్శించారు. తాము కూడా రెండు రాష్ట్రాలకు న్యాయం కావాలని కోరుకుంటున్నామన్నారు. విభజన చట్టంలోని హామీల ప్రస్తావన లేకుండానే రాష్ట్రపతి ప్రసంగం నడిచిందన్నారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ పార్టీ అధినేత్రి నిర్ణయం తీసుకుంటే తాము వ్యతిరేకించి పోరాటం చేశామని గుర్తు చేశారు. ఏపీకి అదనంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలను ఇచ్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నారు. ఏపీకి కావాల్సింది... నదులను అనుసంధానం చేసే పోలవరం ప్రాజెక్టు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలన్నారు. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర,సీమ జిల్లాలకు రాయితీ ఇవ్వాలన్నారు. పోర్టు నిర్మాణానికి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించాలన్నారు. ఏపీలో రెవెన్యూ లోటు పూడ్చేందుకు సహకరించాలన్నారు. తెలంగాణకు నాలుగవేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications