హోదా రాదు: బాబుకు కేవీపీ లేఖ, 'అమరావతి టు కౌలాలంపూర్ విమానం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని ఆ లేఖలో కేవీపీ ప్రస్తావించారు.
రాజ్యసభలో తాను ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు ద్వారా కేంద్రమంత్రి హరిభాయ్ చౌదరి.. ప్రత్యేక హోదా పైన తేల్చి చెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానాన్ని కూడా కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయాన్ని కేవీపీ... చంద్రబాబుకు గుర్తు చేశారు. ఈ నెల 13వ తేదీన మరోసారి ప్రత్యేక హోదా పైన సభలో చర్చ జరగనుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభకు హాజరై తమకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో, ప్రయోజనాల విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఏకం కావాలన్నారు. ప్రత్యేక హోదా, ఏపీకి నిధుల విషయంలో చంద్రబాబు.. ఎన్డీయే మద్దతు కూడగట్టాలని కేవీపీ సూచించారు. రాష్ట్ర విభజన బిల్లుకు సంబంధించి సవరణలపై లేఖలో వివరించారు.

అమరావతి టు కౌలాలంపూర్ ప్రత్యేక విమానం: చంద్రబాబు
ఏపీ పెట్టుబడులకు అనుకూలమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి అన్ని రకాల సహజవనరులు ఉన్నాయి చెప్పారు. కృష్ణా, గోదావరి నీటితో నిత్యం కళకళలాడే ప్రాంత అమరావతి అన్నారు. రాజధాని నుంచి కౌలాలంపూర్‌కు ప్రత్యేక విమానాలు నడుపుతామని చెప్పారు.
చంద్రబాబు మలేషియా పారిశ్రామికవేత్తలతో సమావేశం సందర్భంగా పైవిధంగా మాట్లాడారు. మలేషియా సహకారంతో హైదరాబాదులో టౌన్ షిప్ నిర్మించామన్నారు. అమరావతి నిర్మాణానికి మలేషియా సహకారం కావాలన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 26 దేశాలు ముందుకు వచ్చాయన్నారు. ప్రతి ఇంటికి టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
జగన్ అసత్య ప్రచారాలు: కళా
తమ ప్రభుత్వం పైన జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు వేరుగా అన్నారు. కరువు, తాగునీటి కష్టాలను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. విభజన చట్టం అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.












Click it and Unblock the Notifications