రాజ్యసభ: గంటా వద్ద బోరున ఏడ్చిన కెవిపి, ఆ ఇద్దరికి...
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తున్న కెవిపి రామచంద్ర రావు బోరున విలపించారట. రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి రెబల్ ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. బుధవారం కెవిపి మంత్రి గంటా శ్రీనివాస రావును కలిసి రెబల్ అభ్యర్థులను ఉపసంహరించకునేలా చూడాలని కోరారు. ఈ సమయంలో ఆయన కన్నీరు కార్చారట.
రాజ్యసభ ఎన్నికల బరిలో తిరుగుబాటు అభ్యర్థులుంటే అంతిమంగా నష్టపోయేదెవరో తెలుసా... అని గంటాను ప్రశ్నిస్తూ కెవపి రావు బిగ్గరగా ఏడ్చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని గంటా చాంబర్లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత గంటా చాంబర్‌కు కెవిపి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి దానం తదితరులు వెళ్లారు.

అప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులతో మంత్రి గంటా చర్చిస్తున్నారు. తన చాంబర్‌కు వచ్చిన కెవిపిని గంటా ఆహ్వానించారు. అక్కడే తిరుగుబాటు అభ్యర్థి చైతన్య రాజు కూడా ఉన్నారు. అంతలో ఆదాల ప్రభాకర రెడ్డి కూడా వచ్చారు. మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజానాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుగుబాటు అభ్యర్థుల పోటీ చర్చకు వచ్చింది. వారిని బరిలో నుంచి తప్పించాలని గంటాను కెవిపికోరారు.
దీంతో, వారు సమైక్య నినాదంతో బరిలోకి దిగారని తప్పుకోవాలంటూ వారిని తానెలా కోరతానని గంటా చెప్పారు. ఈ సమయంలో సమైక్య వాదంతో తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటే అంతిమంగా నష్టపోయేది ఎవరో తెలుసా అని గంటాను ప్రశ్నిస్తూ కెవిపి ఏడ్చేశారు.
కెవిపి అంతటి పెద్ద మనిషి ఒక్కసారిగా బిగ్గరగా ఏడ్వడంతో గంటా చాంబర్‌లోని వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత తిరుగుబాటు అభ్యర్థులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, చైతన్య రాజులతో కెవిపి మాట్లాడారు. అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. 'నేను విభజనవాదినా?' అని ప్రశ్నించారు. పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకోవాలంటూ వారిద్దరినీ పట్టుకుని కెవిపి కంటతడి పెట్టారట.
కాగా, ఎంఏఖాన్ మైనార్టీ అభ్య్రర్థి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. మరో అభ్యర్థి టి సుబ్బిరామి రెడ్డి ఆర్థిక పుష్టి గలవారు. ఈ కారణంగానే కెవిపి ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మరోవైపు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కనందుకు టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అసెంబ్లీ లాబీల్లో కంటతడి పెట్టిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications