'ఈస్ట్ ఇండియా కంటే సింగపూర్ షరతులెక్కువ, చెన్నై కంటే అమరావతికి ముప్పు'
హైదరాబాద్: ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే సింగపూర్ కంపెనీ ఎక్కువ షరతులు పెడుతోందని, ఏపీ రాజధాని అమరావతి పైన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై కంటే అమరావతికే ఎక్కువ ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై వరదలను దృష్టిలో ఉంచుకొని అమరావతి నిర్మాణంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని వస్తుందని సంతోషించాలా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని ఆవేదన చెందాలా అర్థం కాని పరిస్థితి అని అందులో పేర్కొన్నారు. 120 రకాల పంటలు పండే జరీబ్ భూములను సర్కారు రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తోందన్నారు.

రాజధాని సేఫ్ గార్డులో ఉండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీరు తప్ప ఏమీ ఇవ్వలేదన్నారు. ఎలాంటి టెండర్లు లేకుండా భూములను ఏపీ ప్రభుత్వం సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆరోపించారు.
ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు నవాబు నిర్ణయాల్లా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే సింగపూర్ కంపెనీ రాజధాని విషయంలో ఎక్కువ షరతులు పెడుతోందన్నారు. భావితరాలను ఇబ్బంది పెట్టవద్దని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications