ఏపీలో టీడీపీకే పట్టం: వంద సీట్లతో అధికారం..వైసీపీకి 72..జనసేనకు 3 : లగడపాటి ఎగ్జిట్ పోల్స్ .
Recommended Video
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ముందు ఇచ్చిన సంకేతాలకు అనుగుణంగానే ఏపీ ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను ఆయన వెల్లడించారు. సంస్థ చేసిన సర్వే ప్రకారం టీడీపీ వంద సీట్లకు పైగా సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని వివరించారు. ఇక, వైసీపీకి 72 సీట్ల వరకు వస్తాయని..జనసేన మూడు సీట్లతో సరి పెట్టుకోవాల్సిందేనని జోస్యం చెప్పారు. ఇతర సర్వే సంస్థలు మెజార్టీ శాతం వైసీపీకి అనుకూలంగా ఇస్తే..లగడపాటి మాత్రం టీడీపీదే అధికారం అని తేల్చి చెబుతున్నారు.

టీడీపీకే అధికారం..వంద సీట్లతో..
ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తిరిగి వంద సీట్లతో అధికారం నిలబెట్టుకుంటుందని లగడపాటి స్పష్టం చేసారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి వంద సీట్లు, వైసీపీకి 72 సీట్లు, జనసేనకు రెండు సీట్లు వస్తాయని లగడపాటి తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించారు. అయితే, టీడీపీ..వైసీపీ కి అంచనా వేస్తున్న స్థానాల్లో పది స్థానాల వరకు ప్లస్ లేదా మైనస్ ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. జనసేన మూడు స్థానాలు సాధిస్తుందని చెప్పిన లగడపాటి అందులో ప్లస్ ఆర్ మైనస్ రెండు స్థానాలు చెప్పటం ద్వారా పవన్ గెలుపు మాత్రమే ఖాయమని పరోక్షంగా చెబుతున్నారు. ఇక, లోక్‌సభ స్థానాల్లోనూ టీడీపీకే ఆధిక సీట్లు వస్తాయని తేల్చారు. టీడీపీకి 15, వైసీపీకి 10 ప్లస్ ఆర్ మైనస్ రెండు స్థానాలుగా వెల్లడించారు.

టీడీపీ..వైసీపీ మధ్య మూడు శాతం ఓట్ల తేడా..
ఆర్జీ ఫ్లాష్ టీం లగడపాటి సర్వే ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం 43 నుండి 45 శాతం ఓట్లు సాధించగా, వైసీపీ 40 నుండి 42 శాతం ఓట్లు దక్కించుకుందని అంచనా వేసారు. అదే విధంగా జనసేన పది నుండి 12 శాతం ఓట్లు పొందిందని సర్వేలో తేలిందని లగడపాటి చెప్పుకొచ్చారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ తరహా లోనే 43 నుండి 45 శాతం ఓట్లు సాధించగా, వైసీపీ మాత్రం 40.5 నుండి 42.5 శాతం వరకు ఓట్ షేర్ దక్కించుకుందని వివరించారు. జనసేనకు అసెంబ్లీ ఓట్ల తరహాలోనే లోక్‌సభకు సైతం 10 నుండి 12 శాతం వరకు ఓట్లు పోలయ్యాయని విశ్లేషించారు. ఇక, తెలంగాణలో టిఆర్‌యస్ 14 నుండి 16 లోక్‌సభ సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఎంఐఎం ఒక స్థానం గెలుస్తుందని స్పష్టం చేసారు.

సర్వే తీరు..ప్రజాభిప్రాయం..
లగడపాటి చెప్పిన లెక్కల ప్రకారం ఆర్జీ ఫ్లాష్ టీం ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత అంటే ఏప్రిల్ 12 నుండి 21వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. ఏపీలోని మొత్తం 38 అసెంబ్లీ నియోకవర్గాల్లో సర్వే చేయగా..ఒక్కో నియోజకవర్గం లో 1200 మంది ఓటర్ల నాడి తెలుసుకున్నామని చెప్పారు. అందులో వివిధ వయస్సులు..వర్గాలు.. గ్రామీణ..పట్టణ ప్రాంతాల వారీగా మొత్తంగా 50 వేల శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ సిద్దం చేసామని స్పష్టం చేసారు. 38 అసెంబ్లీ నియోజకవర్గాలను రాండమ్‌గా ఎంచుకున్నట్లు వివరించారు. ఇక, తమ సర్వేలో తేలిన దాని ప్రకారం మహిళల్లో టీడీపీ పట్ల ఆదరణ బలంగా ఉండగా..పురుషులు ఎక్కువ శాతం వైసీపీ వైపే మొగ్గు చూపారని విశ్లేషించారు. అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో యువత ఎక్కువగా జనసేన వైపు మొగ్గు చూపారని తమ సర్వేలో తేలిందన్నారు. ఇక, ఓటర్లతో ప్రభుత్వం పైన సానుకూలత ఉండగా..స్థానిక ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కనిపించిందని చెప్పుకొచ్చారు. వైసీపీ వైపు ఓటు వేసిన వారు ఓపెన్‌గా ఉండగా..టీడీపీకి సైలెంట్ ఓటింగ్ జరిగిందని లగడపాటి విశ్లేషించారు.












Click it and Unblock the Notifications