స్థాయి తగ్గించుకుని...: చిరంజీవిపై లగడపాటి విసుర్లు
విజయవాడ: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యుటిగా) చేయాలనే సీమాంధ్ర చిరంజీవి, జెడి శీలం వంటి కేంద్ర మంత్రుల వాదనను కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తప్పు పట్టారు. హైదరాబాదును యుటి చేయాలని కేంద్ర మంత్రులు స్థాయి తగ్గించుకుని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. విభజన జరగదని తాను గట్టిగా నమ్ముతున్నానని, విభజన జరిగితే మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు. విభజన జరగకపోతే జరుగుతుందని అంటున్నవాళ్లు రాజీనామాలు చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు. తాను అన్ని విధాలుగా ఆలోచించే మాట్లాడుతున్నట్లు లగడపాటి చెప్పారు.

పోరాటంలో విజయం తమదేనని, తాను వ్యక్తిగతంగా మాట్లాడడం లేదని, అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో బిల్లు రాదని ఆయన అన్నారు. చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే కాంగ్రెసు పార్టీ ఖాళీ అవుతుందని ఆయన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటనకు ప్రతిస్పందనగా అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే తాను కాంగ్రెసుకు 30 సీట్లు గెలిపించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మొదటి నుంచీ సమైక్యాంధ్రనే కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటామని, విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెబుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications