రజనీకాంత్ తప్పుచేసానని క్షమాపణ కోరారు - లక్ష్మీ పార్వతి..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్ టీటీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్ ను ప్రస్తావించారు. దీని పైన ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు స్పందించారు. రజనీకాంత్ నాటి ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటన సమయంలో ఏం చేసారో గుర్తు చేస్తున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు ను చదివారని ధ్వజమెత్తారు. తాజాగా నందమూరి లక్ష్మీపార్వతి నాడు రజనీకాంత్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
రజనీకాంత్ వ్యాఖ్యలతో: ఎన్టీఆర్ శతజయంతి సభలో మాట్లాడిన రజనీకాంత్ తనకు చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. చంద్రబాబు కారణంగానే తెలుగు వారు ఐటీ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్ లా మారిందని, అందులో చంద్రబాబు రోల్ కీలకమని పేర్కొన్నారు. చంద్రబాబు ను ప్రశంసిస్తూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల పైన వరుసగా ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు. రజనీకాంత్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి సైతం రజనీకాంత్ లక్ష్యంగా పలు అంశాలను ప్రస్తావించారు. రజనీకాంత్ నాడు ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారని ఫైర్ అయ్యారు.

ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో: చంద్రబాబుతో కలిసి రజినీకాంత్ కూడా వెన్నుపోటుదారుడిగా మారాడని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. రజినీకాంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్ చివరి రోజుల్లో మాట్లాడిన మాటలు తెలుసుకోవాలి సూచించారు. పుస్తకాలు రిలీజ్ చేసినంత మాత్రాన జనం నమ్మరని పేర్కొన్నారు. బాలకృష్ణ రెండు సినిమాలు తీస్తే ఏమైందో.. రజినీకాంత్ మాటలకు కూడా అలాంటి స్పందనే ఉంటుందన్నారు. ఇంకోసారి ఎన్టీఆర్ గురించి రజినీకాంత్ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు రజినీకాంత్ అండగా నిలిచాడని గుర్తుచేశారు. తర్వాత ఎన్టీఆర్‌ని కలిసి తాను తప్పు చేశానని క్షమించమని అడిగారని లక్ష్మీపార్వతి కీలక అంశాలను బయటపెట్టారు.

బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నం: నాడు ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో చంద్రబాబు కు రజనీకాంత్ పైన అనేక విమర్శలు వచ్చాయని గుర్తు చేసారు. ఆ సందర్భంలో రజనీ తీరు పైన తమిళ పత్రికలు తీవ్రంగా విమర్శలు చేశాయని గుర్తుచేశారు. రజినీకాంత్ ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ కు మద్దతు పెరుగుతున్న సమయంలో చంద్రబాబు సినిమా హీరోలను తీసుకొచ్చి కొత్త డ్రామాలు ఆడుతున్నారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. రజనీకాంత్ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ సభకు వచ్చిన రజనీకాంత్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదంగా మారాయి.












Click it and Unblock the Notifications