మెట్రో రైలు రూట్ మార్పు: రూ. 300 కోట్ల పరిహారం?
హైదరాబాద్: మెట్రో రైలు రూటును మార్చేందుకు లార్సన్ అండ్ టుర్బో (ఎల్ అండ్ టీ) అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జరిపిన చర్చల సందర్భంగా మూడు చోట్ల మెట్రో రైలు మార్గాన్ని మళ్లించడానికి ఆ సంస్థ అంగీకరించినట్లు చెబుతున్నారు. అందుకు ఎల్ అండ్ టీ 300 కోట్ల రూపాయల పరిహారం అడిగినట్లు చెబుతున్నారు.
మైట్రో రైలు ప్రాజెక్టు రీఅలైన్‌మెంట్‌పై ఇంకా తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందలేదని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అడిగిన చోట్ల పనులను ఎల్ అండ్ టీ ఆపేసినట్లు తెలుస్తోంది. ఇది వరకే వేసిన పిల్లర్ల పనులు ఏమవుతాయనేది తెలియడం లేదు.

ఎల్ అండ్ టీకి రూ. 300 కోట్ల పరిహారం చెల్లించే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని అంటున్నారు. అయితే, ఆ డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారనేది తెలియడం లేదు. ప్రస్తుతం చేసుకున్న ఒప్పంద పత్రాల్లో తదుపరి సంప్రదింపులకు సంబంధించిన కాలమ్ లేదని కూడా వార్తలు వచ్చాయి. ఆ కాలమ్ ఉండాలని ఎల్ అండ్ టి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా మెట్రో రైలు ప్రాజెక్టు రూటును మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చాలా కాలంగా పట్టుబడుతున్నారు. ప్రభుత్వం తీరు వల్ల మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఆగిపోయినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవలి చర్చల్లో సమస్య పరిష్కారమైనట్లు అధికారికంగానే వార్తలు వచ్చాయి.
పార్కింగ్ స్థలాల బెడద
నాగోల్‌లో తప్ప మిగతా మెట్రో రైలు స్టేషన్లలో వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు మెట్రో స్టేషన్లలో పార్కింగ్ కోసం స్థలాలను గుర్తించలేదని సమాచారం. నాగోల్ - మెట్టుగుడా విభాగంలో వచ్చే ఏడాది మార్చి నుంచి మెట్రో రైలు నడుస్తుంది. ఇప్పటికీ ఇంకా పార్కింగ్ స్థలాలను గుర్తించాల్సే ఉంది.
అయితే, పార్కింగ్ స్థలాలను త్వరలోనే గుర్తిస్తామని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అంటున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ భూములు స్టేషన్ పరిసరాల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఫీడర్ సర్వీసెస్ విధానం గురించి కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టిన లార్సన్ అండ్ టుబ్రో పరిధిలోకి రాదు. ప్రభుత్వమే వాటికి స్థలాలను కేటాయించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications