నన్ను వదిలేసి అందర్నీ పిలుస్తారా ? రాష్ట్రపతి ముర్ముకు లక్ష్మీపార్వతి లేఖ..
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద ఆయన శత జయంతి ఉత్సవాల సందర్బంగా 100 రూపాయల నాణెం విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాష్ట్రపతి భవన్ లో ఈ నెల 28న జరిగే ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబాలను ఆహ్వనించిన కేంద్రం... ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని మాత్రం పిలవలేదు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాలు బహిష్కరించిన లక్ష్మీపార్వతిని కేంద్రం కూడా పక్కనబెట్టడంపై చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలి హోదాలో లెటర్ ప్యాడ్ పై రాష్ట్రపతికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఇందులో ఎన్టీఆర్ పేరుతో నాణెం విడుదల చేసే కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో తన పేరు కూడా చేర్చాలని లక్ష్మీ పార్వతి కోరారు. తాను ఎన్ఠీఆర్ ను పెళ్లి చేసుకున్నానని లేఖలో వెల్లడించారు. 1994 ఎన్నికల్లో తన భర్త ఎన్ఠీఆర్ తో పాటు ఉన్నానని లక్ష్మీపార్వతి రాష్ట్రపతికి తెలిపారు.

కేంద్రం ఎన్టీఆర్ పేరుతో ఆయన శతజయంతి సందర్భంగా 100 రూపాయల నాణెం విడుదల చేయడంపై లక్ష్మీపార్వతి ధన్యవాదాలు తెలిపారు. తాను ఎన్టీఆర్ ను 1993 సెప్టెంబర్ 11న పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. తామిద్దరం అన్యోన్యంగా జీవించామని, 1994 ఎన్నికల్లో కలిసి ప్రచారం కూడా చేశామన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 226 సీట్లు కూడా గెల్చిందన్నారు. కానీ చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారన్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ 1996 జనవరి 18న చనిపోయారన్నారు.
కానీ విచిత్రంగా ఎన్టీఆర్ మరణానికి కారణమైన ఆయన కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి ఆహ్వానించారని, కానీ ఆయన చట్టబద్ధమైన వారసురాలిని అయిన తనను మాత్రం విస్మరించారన్నారు. ఇప్పటికీ ఆయన పెన్షన్ కూడా తనకు రావడం లేదని, ఇప్పుడు ఈ కార్యక్రమం జాబితాలో తన పేరు చేర్చని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. కాబట్టి భారత ప్రథమ మహిళగా తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.














Click it and Unblock the Notifications