జమిలి వేళ కూటమిలో కొత్త టెన్షన్ - చేయి దాటుతోంది..!!
జమిలి ఎన్నికల పైన దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలోనూ రాజకీయ పార్టీలు జమిలికి సమాయత్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ జమిలి నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. దీంతో, ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేసింది. ఇదే సమయంలో తాజా ఎన్నికల్లో మూడు పార్టీల కలయిక అనూహ్య విజయానికి కారణమైంది. ఇదే వచ్చే ఎన్నికలకు కొనసాగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కానీ, ఇక్కడే కొత్త టెన్షన్ మొదలైంది. పరిస్థితి చేయి దాటుతోంది.
తమ్ముళ్లు వర్సస్ సైనికులు
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి తాజా ఎన్నికల్లో ఏపీలో ఏకంగా 164 సీట్లు సాధించాయి. మూడు పార్టీల ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోంది. ప్రధానంగా టీడీపీ, జనసేన కేడర్ మధ్య కొన్ని ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఇప్పుడు ఈ రెండు పార్టీల నాయకత్వానికి సమస్యగా మారుతున్నాయి. ఈ రెండు పార్టీల కేడర్ మధ్య గ్యాప్ కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి క్లీన్ స్వీప్ చేసాయి. అక్కడే ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాము వైసీపీ శ్రేణులతో పోరాటం చేసి గెలిపిస్తే.. గెలిచిన తరువాత ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవటం లేదని కేడర్ అసహనంతో రగిలి పోతోంది.

గోదావరి జిల్లాల్లో
పవన్ కల్యాణ్ గెలిచిన పిఠాపురంలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మను అక్కడి జనసేన కేడర్ లెక్క చేయటం లేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కనీసం గౌరవం దక్కటం లేదని వాపోతున్నారు. తాజాగా దెందులూరులోనూ చోటు చేసుకున్న పరిణామాలు.. రెండు పార్టీల కేడర్ ఘర్షణకు దిగటం పైన రెండు పార్టీల నాయకత్వంలో ఆందోళన కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రెండు పార్టీల కేడర్ మధ్య అంతరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు లోలోపల ఉన్న వ్యతిరేక భావం ఇప్పుడు బాహాబాహీకి దిగే వరకు వెళ్లింది.కాకినాడ రూరల్, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేల తీరు పైన టీడీపీ శ్రేణులు ఆగ్రహం తో ఉన్నాయి.

పెరుగుతున్న గ్యాప్
ఎవరి మద్దతు తో ఎవరు గెలిచారనే చర్చ ఇప్పుడు రెండు పార్టీల శ్రేణులకు ప్రతిష్ఠగా మారింది. ఈ చర్చ ప్రతీ చోట మొదలైంది. సోషల్ మీడియాలోనూ రెండు పార్టీల మద్దతు దారులు ఇదే రకమైన చర్చకు కారణమవుతున్నారు. కాకినాడ ఎంపీ శ్రీనివాస్ తో పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలతో సమన్వయం కొరవడింది. పలు నియోజకవర్గాల్లో రెండు పార్టీల శ్రేణులు తమ నేతల ఫొటోలు... తమ పార్టీ కండువాల కోసం గొడవలు పడుతున్నారు. మండల స్థాయిలో సమన్వయ కమిటీలు వేసే ప్రతిపాదన ఇంకా అమలు కాలేదు. అటు జమిలి ఎన్నికల దిశగా ఢిల్లీలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ సమయంలో కూటమి పార్టీల కేడర్ మధ్య పెరుగుతున్న గ్యాప్.. సమస్యల పరిష్కారం ఇప్పుడు రెండు పార్టీల అధినాయకత్వానికి పరీక్షగా మారుతోంది.












Click it and Unblock the Notifications