వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై-పార్టీకి, ఎంపీ పదవికీ రాజీనామా..
ఎన్నికల వేళ ఏపీలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అలాగే తన రాజీనామాకు దారి తీసిన కారణాలను కూడా ఆయన వెల్లడించారు. దీంతో నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

గత ఎన్నికల్లో పల్నాడు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, మంచి మెజారిటీతో పార్లమెంటుకు పంపించారని లావు కృష్ణదేవరాయలు తెలిపారు. అలాగే తన వంతుగా పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేసినట్లు ఆయన గుర్తుచేశారు. కానీ గత కొన్ని రోజులుగా పార్టీలో అనిశ్చితి నెలకొందని, అది తన వల్ల వచ్చింది కాదన్నారు. దీంతో కార్యకర్తలు కూడా గందరగోళానికి గురవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు లావు తెలిపారు.
నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలను వైసీపీ అధిష్టానం ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా అక్కడి నుంచి తప్పించి గుంటూరు నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. అయితే ఇందుకు ఆయన ఇష్టపడలేదు. నరసరావుపేటను వదిలి గుంటూరుకు వెళ్లేది లేదని తేల్చిచెప్పేశారు. దీంతో నరసరావుపేటలో అయితే టికెట్ ఇవ్వబోమని అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. దీంతో చేసేది లేక వైసీపీని వీడేందుకు లావు నిర్ణయించారు. త్వరలో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే లోకేష్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.
మరోవైపు ఇప్పటికే వైసీపీని సిట్టింగ్ ఎంపీలైన డాక్టర్ సంజయ్ కుమార్, బాలశౌరి వీడిపోయారు. వీరి బాటలోనే ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేయడంతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య మూడుకు చేరుకున్నట్లయింది. ప్రస్తుతానికి డాక్టర్ సంజయ్ సైలెంట్ గా ఉండగా.. బాలశౌరి జనసేనలోకి , లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications